Vishnu Kumar Raju: నియోజకవర్గానికి 40 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైపోయారు: విష్ణుకుమార్ రాజు
- ఏపీలో అరాచకాలు పెరిగిపోతున్నాయన్న విష్ణుకుమార్ రాజు
- వైసీపీ నేతల వద్ద నల్లధనం భారీగా ఉందని ఆరోపణ
- ఏపీలో సీబీఐ, ఈడీ, ఐటీ రెయిడ్స్ ఎందుకు జరగడం లేదని ప్రశ్న
ఏపీలో అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. హత్యలు చేసిన ఎమ్మెల్సీలను జగన్ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు. వైసీపీ నేతల వద్ద పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ఉందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనంత నల్లధనం ఏపీలో ఉందని చెప్పారు.
క్యాష్ ద్వారా లిక్కర్ అమ్మకాలను చేయడం వల్ల వైసీపీ నేతలు భారీగా నల్లధనాన్ని పోగేశారని అన్నారు. ఈ అక్రమ సంపాదనతోనే వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో రూ. 40 కోట్లు ఖర్చు పెట్టేందుకు వైసీపీ నేతలు రెడీ అయిపోయారని చెప్పారు. ఆ డబ్బును చూసుకునే 175 సీట్లలో గెలుస్తామనే ధీమాతో ఉన్నారని అన్నారు. ఏపీలో సీబీఐ, ఈడీ, ఐటీ రెయిడ్స్ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.