IAF: సరిహద్దుల్లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత వాయుసేన
- సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలు
- భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన వైనం
- చైనా సైనికులను అడ్డుకున్న భారత జవాన్లు
- పార్లమెంటులో ప్రకటన చేసిన రాజ్ నాథ్ సింగ్
- యుద్ధ విమానాలను మోహరించిన భారత వాయుసేన
సరిహద్దుల్లో చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడడం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారు. అయితే, చైనా సైనికులను భారత బలగాలు సమర్థంగా నిలువరించాయి. ఈ సందర్భంగా ఇరువైపులా సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై ఇవాళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన కూడా చేశారు. చైనా దురాక్రమణకు యత్నించిందని తెలిపారు.
గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగి రెండేళ్ల తర్వాత సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో, భారత వాయుసేన అప్రమత్తమైంది. చైనాతో సరిహద్దు పొడవునా పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది.
ఇప్పటికే వాస్తవాధీన రేఖకు సమీపంలో వాయుసేన సుఖోయ్-30 జెట్ ఫైటర్ విమానాలను మోహరించింది. అసోంలోని ఛబువా, తేజ్ పూర్ ఎయిర్ బేస్ లలోనూ యుద్ధ విమానాలను సంసిద్ధంగా ఉంచింది. ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్ లో సరిహద్దుకు అత్యంత సమీపంలో హషీమరా వద్ద రాఫెల్ పోరాట విమానాలను మోహరించడం ద్వారా భారత వాయుసేన చైనాకు గట్టి హెచ్చరికలు పంపింది.
అంతేకాదు, సరిహద్దుకు ఆవల నుంచి ఎదురయ్యే గగనతల ముప్పును ఎదుర్కొనేందుకు ఎస్-400 రక్షణ వ్యవస్థలతో సరిహద్దుల వద్ద తన స్థావరాలను మరింత బలోపేతం చేసింది.