Johnsi: ఆ సినిమాతో ఉన్నదంతా ఊడ్చుకుపోయింది: సీనియర్ నటి ఝాన్సీ
- కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఝాన్సీకి మంచి పేరు
- నిర్మాతగా 'ఖైదీ ఇన్ స్పెక్టర్' నిర్మాణం
- ఆ సినిమాతో అప్పుల పాలయ్యామని వ్యాఖ్య
- ఒంటరి జీవితం కొనసాగిస్తున్నానని వెల్లడి
నిన్నటితరం సినిమాకి సంబంధించిన కేరక్టర్ ఆర్టిస్టులలో ఝాన్సీ ఒకరు. 70 ... 80 దశకాలలో ఆమె చాలా సినిమాలలో నటించారు. విలన్ కి భార్య గాను, హీరో .. హీరోయిన్లకు తల్లి పాత్రలలోను మెప్పించారు. అలాంటి ఆమె ప్రస్తుతం హైదరాబాదులోనే ఒక సింగిల్ రూమ్ లో అద్దెకి ఉంటున్నారు. చాలాకాలం తరువాత సుమన్ టీవీ ఇంటర్వ్యూతో ఆమె కెమెరా ముందుకు వచ్చారు.
ఝాన్సీ మాట్లాడుతూ .. 30 ఏళ్ల క్రితం మేము చెన్నైలో ఉండేవాళ్లము. ఇండస్ట్రీ హైదరాబాదుకి రావడంతో మేము కూడా వచ్చేశాము. అయితే ఇక్కడికి వచ్చాక నటిగా నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. అప్పుడు మా వారు సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి హీరో సుమన్ తో 'ఖైదీ ఇన్ స్పెక్టర్' సినిమాను నిర్మించారు. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాగానే ఆడినా డబ్బులు మా వరకూ రాలేదు" అన్నారు.
ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి ఉన్న ఇళ్లను అమ్ముకోవలసి వచ్చింది. ఆస్తులు పోయినందుకు నేను పెద్దగా బాధపడ లేదు. కానీ ఆ తరువాత మా వారు చనిపోయారు. ఇద్దరు మగపిల్లలకు పెళ్లిళ్లు చేశాను. కోడళ్లు వచ్చి వాళ్లను తీసుకుని పోయారు. ఆర్ధికంగా కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ రోజులు నెట్టుకొస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.