Elon Musk: ప్రపంచ సంపన్నుల్లో రెండో స్థానానికి పడిపోయిన మస్క్.. అగ్రస్థానం ఎవరిదంటే..!
- 2021 సెప్టెంబర్ నుంచి అగ్రస్థానంలో కొనసాగిన మస్క్
- తిరిగి అగ్రస్థానానికి చేరుకున్న బెర్నాల్డ్ ఆర్నాల్ట్
- జనవరి నుంచి వంద బిలియన్ డాలర్లు కోల్పోయిన ఎలాన్ మస్క్
టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయారు. ఒకప్పుడు 340 బిలియన్ డాలర్ల సంపదతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను దాటి ప్రపంచ కుబేరుడిగా మారిన మస్క్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 51 ఏళ్ల ఎలాన్ మస్క్ తన సంపదలో జనవరి నుంచి దాదాపు 100–168.5 బిలియన్ డాలర్లు కోల్పోయారు. ఈ లెక్కన ప్రస్తుతం ఆర్నాల్ట్ 172.9 బిలియన్ డాలర్ల నికర విలువ కంటే మస్క్ సంపద తగ్గిపోయింది. దాంతో, 2021 సెప్టెంబర్ నుంచి ఆర్జనలో అగ్రస్థానంలో ఉన్న మస్క్ తొలిసారి రెండో స్థానానికి పడిపోయారు. అర్నాల్ట్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నారు.
కాగా, ఈ ఏప్రిల్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలన్న నిర్ణయం తీసుకున్న మస్క్ అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత వెనక్కితగ్గడంతో ఆయన న్యాయపోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు ముందుగా అనుకున్న విధంగానే 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న మస్క్ పలు వివాదాస్పద నిర్ణయాలతో రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్ కొనుగోలు కోసం టెస్లాలో మస్క్ 15 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ క్రమంలోనే ఆయన సంపద తగ్గిపోయింది.