IPL: ఐపీఎల్ వేలంలో పాల్గొనే ఆటగాళ్లు వీరే!
- ఈ నెల 23న కొచ్చిలో జరగనున్న వేలం
- 991 మంది నుంచి షార్ట్ లిస్ట్ అయిన 405 మంది ఆటగాళ్లు
- బెన్ స్టోక్స్, గ్రీన్ భారీ ధర పలికే అవకాశం
ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీన కొచ్చిలో వేలం జరగనుంది. ఇందుకోసం 991 మంది ఆటగాళ్లు రిజష్టర్ చేసుకోగా.. వీరిలో నుంచి ఫ్రాంచైజీలు 405 మందిని షార్ట్ లిస్ట్ చేశాయి. అన్ని జట్లలో ఖాళీగా ఉన్న 87 స్థానాలకు వీరు వేలంలో పాల్గొంటారు. షార్ట్ లిస్ట్ చేసిన క్రీడాకారుల్లో 273 మంది భారత క్రికెటర్లు కాగా, 132 మంది విదేశీయులు ఉన్నారు. నలుగురు ఐసీసీ అనుబంధ దేశాలకు చెందిన వాళ్లు కూడా ఉన్నారు. వీరిని రూ. 20 లక్షలు, 30 లక్షలు, 75 లక్షలతో పాటు రూ. కోటి, కోటిన్నర, రెండు కోట్ల ప్రారంభ ధరతో విభజించారు.
రూ. రెండు కోట్ల ప్రారంభ ధర ఉన్న ఆటగాళ్లలో ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్ పై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వీళ్లు అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. సన్ రైజర్స్ జట్టులో అత్యధికంగా 13 ఖాళీలు ఉండగా.. ఆ జట్టు దగ్గర రూ. 42.25 కోట్లు వేలంలో ఖర్చు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. కోల్ కతాకు 11 మంది అవసరం కాగా కేవలం 7 కోట్లు మాత్రమే ఉన్నాయి. లక్నో జట్టులో పది ఖాళీలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అత్యల్పంగా ఐదు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. కాగా, అన్ని జట్లు కలిపి వేలంలో 206 కోట్లు ఖర్చు చేయనున్నాయి.