Team India: పుజారా, అయ్యర్ అర్ధ శతకాలు.. గాడిలోపడ్డ భారత ఇన్నింగ్స్
- 200 దాటిన భారత స్కోరు
- మెరుపు ఇన్నింగ్స్ ఆడి వెనుదిరిగిన పంత్
- నిరాశ పరిచిన కోహ్లీ, గిల్, రాహుల్
బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయిన భారత్ కోలుకుంది. చతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీలతో సత్తా చాటడంతో ఇన్నింగ్స్ గాడిలో పడింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్లు శుభ్ మన్ గిల్ (20), కేఎల్ రాహుల్ (22)తో పాటు విరాట్ కోహ్లీ (1) వికెట్ కోల్పోయి 48/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో పుజారాకు తోడైన రిషబ్ పంత్ (46) దూకుడుగా ఆడి స్కోరు వంద దాటించాడు. కానీ, అర్ధ శతకానికి చేరువైన అతడిని స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
దాంతో, నాలుగో వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో పుజారాకు శ్రేయస్ అయ్యర్ తోడయ్యాడు. పుజారా తనదైన శైలిలో టెస్టు ఇన్నింగ్స్ ఆడుతుండగా.. శ్రేయస్ దూకుడు చూపెడుతున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకోగా.. భారత్ స్కోరు చివరి సెషన్ ఆరంభంలోనే 200 మార్కు దాటింది. ప్రస్తుతం 66 ఓవర్లకు 209/4 తో నిలిచింది. పుజారా 64, శ్రేయస్ 54 పరుగులతో అజేయంగా నిలిచారు.