AIIMS: ఎయిమ్స్ సర్వర్లపై దాడి వెనుక చైనా హ్యాకర్ల హస్తం ఉంది: కేంద్రం
- ఇటీవల ఎయిమ్స్ కంప్యూటర్లపై హ్యాకర్ల దాడి
- లక్షల మంది రోగుల కీలక సమాచారంపై ఆందోళన
- చర్యలు చేపట్టిన కేంద్రం
- హ్యాకర్ల నుంచి ఎయిమ్స్ సర్వర్లకు విముక్తి
దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కంప్యూటర్ వ్యవస్థలపై ఇటీవల హ్యాకర్లు పంజా విసిరిన సంగతి తెలిసిందే. దాంతో రోజుల తరబడి ఎయిమ్స్ సర్వర్లు మూగబోయాయి. లక్షల మంది రోగుల కీలక సమాచారం భద్రతపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో దేశంలోని అత్యున్నతస్థాయి ప్రముఖులు చికిత్స పొందుతుంటారు. వారికి చెందిన సమాచారం కూడా హ్యాకర్ల పాలయ్యే ప్రమాదం నెలకొంది.
దీనిపై కేంద్ర హోంశాఖ, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) దర్యాప్తు చేశాయి. ఎయిమ్స్ కంప్యూటర్లపై దాడికి పాల్పడింది చైనా హ్యాకర్లేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, హ్యాకర్ల అధీనం నుంచి ఎయిమ్స్ కంప్యూటర్లకు విముక్తి కల్పించినట్టు వెల్లడించాయి. ఆ కంప్యూటర్లలోని కీలక సమాచారాన్ని తిరిగి పొందినట్టు వివరించాయి.
ఓవరాల్ గా ఎయిమ్స్ కు చెందిన 5 సర్వర్లను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకున్నారని, ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా, హ్యాకింగ్ కు పాల్పడిన సైబర్ నేరగాళ్లు రూ.200 కోట్లను క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు.