Dorababu: ముఖ్యమంత్రి గుజరాత్ సంస్థ అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం సిగ్గుచేటు: టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు
- పాడి పరిశ్రమను అమూల్ కు ధారాదత్తం చేశారన్న దొరబాబు
- పాడి రైతులని అమూల్ కు బానిసలను చేస్తున్నారని ఆగ్రహం
- సొంత రాష్ట్రంలోని డెయిరీలకు అండగా నిలవాలని డిమాండ్
టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు (బీఎన్ రాజసింహులు) ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమీషన్లకు కక్కుర్తిపడి, కేసుల భయంతో ఏపీ పాడి పరిశ్రమను అమూల్ సంస్థకు ధారాదత్తం చేశారంటూ మండిపడ్డారు. లీటర్ పాలపై రెండు మూడు రూపాయలు తక్కువ ఇస్తున్న ‘అమూల్’ కు రాష్ట్రంలోని డెయిరీలన్నింటిని తాకట్టుపెట్టిన ముఖ్యమంత్రి, పాడి రైతుల్ని బానిసల్ని చేస్తున్నాడని విమర్శించారు.
ప్రభుత్వాధినేతగా ఉండి, ప్రభుత్వరంగ డెయిరీలను, వాటి తాలూకా ఆస్తుల్ని కాపాడి, పాడి రైతులకు న్యాయంచేయాల్సిన ముఖ్యమంత్రి, గుజరాత్ సంస్థ అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం సిగ్గుచేటని దొరబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
"ముఖ్యమంత్రి గుజరాత్ సంస్థ అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం సిగ్గుచేటు. అమూల్ సంస్థ కోసం చిత్తూరు, ఒంగోలు డెయిరీలను నిర్వీర్యం చేయడం దుర్మార్గం. పాదయాత్ర సమయంలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని డెయిరీలతో పాటు, రాష్ట్రంలోని కో ఆపరేటివ్ డెయిరీలను ఆదుకుంటానని జగన్ రెడ్డి చెప్పాడు.
దేశంలోనే పేరు ప్రఖ్యాతిగాంచి, 1982లో ఎంఎన్ పీవోగా ప్రారంభమైన చిత్తూరు డెయిరీని నేడు ఎక్కడినుంచో వచ్చిన అనామక సంస్థ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చిత్తూరు డెయిరీని ఏడాదికి రూ. కోటి చొప్పున 99 ఏళ్లపాటు అమూల్ కు లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అమూల్ డెయిరీ గుజరాత్ సంస్థ. గుజరాత్ వ్యాపారులు రాష్ట్రంలోని పాడిపరిశ్రమపై వచ్చే సంపదను దోచుకుంటారు గానీ, పాడిరైతులకు ఎలాంటి న్యాయంచేయరు.
రాష్ట్రంలో 13 సహకార, 7 ప్రైవేటు డెయిరీలు ఉండగా, వాటిని కాదని గుజరాత్ కు చెందిన అమూల్ తో ఒప్పందం చేసుకోవడం జగన్ రెడ్డి స్వార్థప్రయోజనాలకు నిదర్శనం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా పొరుగువారికి మేలు చేయడం మానేసి, సొంత రాష్ట్రంలోని డెయిరీలకు అండగా నిలవాలి" అని దొరబాబు డిమాండ్ చేశారు.