Viet Jet: బెంగళూరు నుంచి విమానాలు లేకుండానే టికెట్లు అమ్మిన 'వియెట్ జెట్'.. ప్రయాణికుల అగచాట్లు
- వియత్నాం చవక ధరల విమానయాన సంస్థ నిర్వాకం
- టికెట్లు కొని బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులు
- విమానాల్లేకపోవడంతో దిగ్భ్రాంతి
వియత్నాంకు చెందిన చవక ధరల విమానయాన సంస్థ వియెట్ జెట్ బెంగళూరు ప్రయాణికులను అయోమయానికి గురిచేసింది. బెంగళూరు నుంచి ఆ సంస్థ విమానాలేవీ నడవకపోయినప్పటికీ, నగరం నుంచి వియత్నాంకు టికెట్లు బుక్ చేసింది. వియెట్ జెట్ విమాన టికెట్లు తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి, బెంగళూరు నుంచి వియత్నాంలోని నగరాలకు వెళ్లేందుకు చాలామంది టికెట్లు కొనుగోలు చేశారు.
పాపం, వారందరూ బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చిన తర్వాత గగ్గోలుపెట్టారు. కారణం... అక్కడ వియెట్ జెట్ కు చెందిన విమానం ఒక్కటీ కనిపించలేదు. బెంగళూరు నుంచి ఆ సంస్థ ఎలాంటి విమానాలు నడపడంలేదని తెలిసి దిగ్భ్రాంతి చెందారు. కొందరు ప్రయాణికులకు మాత్రం ఎయిర్ పోర్టుకు చేరుకోకముందే, విమానాలు రద్దయ్యాయంటూ ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందింది.
వీరందరూ కూడా పలు ఆన్ లైన్ పోర్టళ్ల నుంచి టికెట్లు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇప్పుడా ప్రయాణికులు టికెట్ సొమ్ము రిఫండ్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా, ముంబయిలోని వియెట్ జెట్ ప్రతినిధులను మీడియా సంప్రదించే ప్రయత్నం చేయగా, అట్నుంచి స్పందన కనిపించలేదు.
గత జులైలో వియెట్ జెట్ ప్రతినిధులు బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, బెంగళూరు నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నామని ప్రకటించారు. నవంబరు మొదటి వారం నుంచి విమానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.