iQOO India: ఫోల్డబుల్ ఫోన్ తెస్తామంటున్న ఐకూ
- ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్లపైనే తమ దృష్టి అన్న కంపెనీ
- ఇయర్ బడ్స్, ట్యాబ్లెట్ లోకి వెళ్లబోమన్న కంపెనీ సీఈవో
- జనవరి 10న ఐకూ 11 సిరీస్ విడుదల
భారత మార్కెట్లో ఐకూ కార్యకలాపాలు మొదలు పెట్టి మూడేళ్లు పూర్తి చేసుకుంది. తనకంటూ ఓ యూజర్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది. త్వరలో ఫోల్డబుల్ ఫోన్ తెస్తామని ఈ సంస్థ అంటోంది. మధ్యస్థాయి బడ్జెట్ కే ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను ఐక్యూ ఇండియా మార్కెట్ చేస్తోంది.
బడ్జెట్ విభాగంలో కొత్త ఫోన్లను వచ్చే ఏడాది తీసుకురానున్నట్టు ఐకూ సీఈవో నిపున్ మార్య ఇండియాటుడే సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటి వరకు అయితే తాము స్మార్ట్ ఫోన్లపైనే దృష్టి సారిస్తామని చెప్పారు. టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్ లను తెచ్చే ఆలోచన ఏదీ లేదన్నారు. భవిష్యత్తులో ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకురావచ్చని సంకేతం ఇచ్చారు.
ఈ సంస్థ తన తదుపరి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయిన ఐకూ 11 సిరీస్ ను జనవరి 10న ఆవిష్కరించనుంది. ఎన్నో కొత్త ఆవిష్కరణలతో యూజర్లను తాము ఆకర్షిస్తామన్న విశ్వాసాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్ చిప్ సెట్ తో ఈ ఫోన్ రానుంది.