Puri Jagannadh Temple: పూరి ఆలయంలో స్మార్ట్‌ఫోన్లపై పూర్తి నిషేధం.. జనవరి 1 నుంచే అమలు
- ఇప్పటి వరకు భక్తులపై మాత్రమే నిషేధం
- ఇప్పుడు పోలీసులు, ఆలయ సిబ్బందిపైనా నిషేధం
- ఆలయం ప్రాంగణంలోకి రావడానికి ముందే సెల్‌ఫోన్ల డిపాజిట్
- అధికారులు, సేవకులకు మాత్రం బేసిక్ మోడల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి ఆలయంలోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని పూర్తిస్థాయిలో నిషేధించారు. ఇప్పటి వరకు ఈ నిబంధన భక్తులకు మాత్రమే పరిమితం కాగా, ఇకపై పోలీసు సిబ్బందితోపాటు అందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందు సేవకులు కూడా తమ స్మార్ట్‌ఫోన్లను ఆలయం బయట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఆలయ అధికారులు, సేవకులు మాత్రం ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్లు లేని బేసిక్ మోడల్ ఫోన్లను తీసుకెళ్లొచ్చని శ్రీ జగన్నాథ ఆలయం చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వీర్ విక్రమ్ యాదవ్ తెలిపారు.