Supreme Court: లంచగొండి అధికారులపై దయ చూపక్కర్లేదు: సుప్రీంకోర్టు

Corrupt babu can be convicted even if proof circumstantial

  • నేర నిరూపణకు ప్రత్యక్ష సాక్ష్యం తప్పనిసరి కాదని వెల్లడి
  • పరోక్ష సాక్ష్యంతోనైనా లంచగొండులను శిక్షించవచ్చని తీర్పు
  • అవినీతి కేన్సర్ లాంటిదన్న అత్యున్నత న్యాయస్థానం

ప్రజలకు సేవ చేసేందుకు నియమించిన అధికారులు అక్రమార్జన కోసం ఆ ప్రజలనే వేధిస్తుంటే వారిపై దయ చూపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సరైన సాక్ష్యం లేదనే కారణంతో అవినీతిపరులను వదిలేయొద్దని కింది కోర్టులకు సూచించింది. లంచం కోసం వేధించే అధికారులను ప్రత్యక్ష సాక్ష్యంలేకున్నా, పరోక్ష సాక్ష్యంతోనైనా శిక్షించవచ్చని తేల్చిచెప్పింది. లంచం అడిగినట్లు, తీసుకున్నట్లు నిరూపించేందుకు ప్రత్యక్ష సాక్ష్యం తప్పనిసరి కాదని పేర్కొంది. ఈమేరకు జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుచెప్పింది.

అవినీతి జరిగినట్టు ప్రత్యక్ష రుజువులు లేకపోయినా, ఇతరత్రా బలమైన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని సదరు అధికారులను దోషులుగా నిర్ధారించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫిర్యాదుదారుడు ఎదురుతిరగడం లేదా చనిపోయినప్పుడు.. ఇతరత్రా ఉన్న సాక్షులు లేదా డాక్యుమెంట్లు, సందర్భోచిత సాక్ష్యాల ఆధారంగా సదరు ఉద్యోగి లంచం అడిగినట్లు, తీసుకున్నట్లు నిరూపించవచ్చని తెలిపింది.

అవినీతి కేన్సర్ లాంటిదని, ఇది ప్రభుత్వంతోపాటూ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. అవినీతి ముప్పుపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి ఒక పెద్ద సమస్యగా మారిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News