Madan Pillutla: ఇది చంద్రబాబు తీర్చిదిద్దిన విద్యాసంస్థ: ఐఎస్ బీ డీన్ మదన్ పిల్లుట్ల
- ఐఎస్ బీ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు
- నేడు ముగింపు సభ.. హాజరైన చంద్రబాబు
- ఐఎస్ బీ హైదరాబాద్ కు తలమానికం అన్న డీన్
- చంద్రబాబు విజన్ ఉన్న నేత అని కితాబు
హైదరాబాదులోని ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల ముగింపు సభ నేడు నిర్వహించారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఐఎస్ బీ డీన్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ, ఐఎస్ బీ చంద్రబాబు తీర్చిదిద్దిన సంస్థ అని కొనియాడారు. ఐఎస్ బీ సాధించిన పురోగతి చూసి చంద్రబాబు ఎంతో సంతోషించారని వెల్లడించారు. ఐఎస్ బీలో 11 ఏళ్ల కిందట చంద్రబాబు ఓ చెట్టును నాటారని, ఇవాళ ఆ చెట్టును చూసి చంద్రబాబు ఎంతో ఆనందించారని డీన్ మదన్ పిల్లుట్ల వివరించారు. నాలెడ్జ్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ కోసం చంద్రబాబు కృషి చేశారని అన్నారు.
తాను మలేసియాలో ఉన్నప్పుడు చంద్రబాబు ఒక బృందాన్ని మలేషియా పంపారని, తన రోల్ మోడల్ చంద్రబాబేనని డీన్ మదన్ పిల్లుట్ల పేర్కొన్నారు.
ఐఎస్ బీ హైదరాబాద్ కు తలమానికంగా నిలిచిందని పేర్కొన్నారు. ఐఎస్ బీలో పరిశోధనలకు పెద్దపీట వేశామని, ఐఎస్ బీ అంతర్జాతీయస్థాయిలో మంచి పేరు తెచ్చుకుందని తెలిపారు. న్యూయార్క్, సియాటిల్, లండన్ వంటి చోట్ల కూడా ఐఎస్ బీ విద్యార్థులు ఉన్నారని, ఐఎస్ బీ విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారని డీన్ వెల్లడించారు.
ఐఎస్ బీ టాప్-10లో కాదు... టాప్ లో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారని ఆయన వివరించారు. హైదరాబాద్, పంజాబ్, ఇతర ప్రాంతాల సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, తెలంగాణలో టి-హబ్ తో కలిసి పనిచేస్తున్నామని వివరించారు.
అటు, ఐఎస్ బీ అధికారులు మాట్లాడుతూ, చంద్రబాబుతో తమకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు ఎంతో దార్శనికత ఉన్న నేత అని కీర్తించారు. ఐఎస్ బీ పురోగతి కోసం ఆయన ఎంతో కృషి చేశారని వెల్లడించారు.