Hyderabad woman: సీబీఐ అధికారులమంటూ వరుస కాల్స్ చేసి బెదిరించి.. రూ.18 లక్షలు దోచేశారు..!

Hyderabad woman lose Rs 18 lakh in the name of fake customs cbi officials

  • సైబరాబాద్ మహిళకు ఎదురైన అనుభవం
  • నార్కోటిక్స్ పార్సిల్ మీ పేరుతో బుక్ అయిందంటూ భయపెట్టిన నేరగాళ్లు
  • దర్యాప్తు పేరుతో డబ్బులు లాగిన వైనం

ఏదో గుర్తు తెలియని నంబర్ నుంచి మీకు కాల్ వచ్చిందనుకోండి..? ఎత్తకపోవడం శ్రేయస్కరం అనుకోవచ్చేమో..! ఎందుకంటే, తెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్స్ కు స్పందించిన హైదరాబాద్ మహిళ నిండా మోసపోయిన ఘటన వెలుగు చూసింది. ఈ కేసును సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఓ రోజు సైబరాబాద్ కు చెందిన మహిళకు కాల్ వచ్చింది. తాను కస్టమ్స్ అధికారిని అంటూ అవతలి వైపు మహిళ పరిచయం చేసుకుంది. ‘మీ ఆధార్ నంబర్ తో ముంబై నుంచి తైవాన్ కు పార్సిల్ బుక్ చేశారు. అది ముంబైకి తిరిగొచ్చింది. అందులో నార్కోటిక్స్ ఉన్నాయి’ అని కాల్ చేసిన మహిళ చెప్పింది. ఇంతలో ఆ కాల్ కట్ అయిపోగా, వెంటనే మరో కాల్ వచ్చింది. తాను ముంబై పోలీసు అధికారినని అవతలి వ్యక్తి చెప్పాడు. విచారణ అంటూ ప్రశ్నలు అడగడంతో వివరాలు ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా ఆధార్, బ్యాంకు వివరాలు కోరగా, వాటిని కూడా ఇచ్చింది. 

మనీ లాండరింగ్ కేసులో పాత్ర ఉందంటూ ఆమెను భయపెట్టాడు. ఇందుకు సంబంధించి సీబీఐ అధికారి కాల్ చేస్తారని పెట్టేశాడు. అన్నట్టుగానే మరో సైబర్ నేరగాడు సైబరాబాద్ మహిళకు కాల్ చేశాడు. తాను సీబీఐ ఏసీపీ ర్యాంక్ అధికారిని అంటూ పరిచయం చేసుకున్నాడు. బ్యాంకు ఖాతా వివరాలను నిర్ధారించుకోవాల్సి ఉందన్నాడు. తన బ్యాంకు ఖాతాకు కొంత నగదు బదిలీ చేయాలని సూచించాడు. 

భయపడిన మహిళ అతడు చెప్పినట్టు విడతల వారీగా రూ.18 లక్షలు చెల్లించింది. అధికారులు తిరిగి కాల్ చేసి, ఆ మొత్తాన్ని తిరిగిచ్చేస్తారని చెప్పాడు. కానీ, ఎలాంటి స్పందన లేదు. ఆమె కాల్ చేసినా అవతలి వారి నుంచి సమాధానమే లేదు. అప్పుడు కానీ తాను మోసపోయానని ఆమె గుర్తించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించింది.

  • Loading...

More Telugu News