FIFA World Cup: రేపు ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్.. ఫ్రాన్స్ జట్టుకు ఊహించని దెబ్బ
- అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య తుది సమరం
- అనారోగ్యం బారిన పడిన ముగ్గురు ఫ్రాన్స్ ఆటగాళ్లు
- స్వల్ప జ్వరంతో బాధపడుతున్న వైనం
ఫుట్ బాల్ ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 8.30 గంటలకు టైటిల్ కోసం అర్జెంటీనా, ఫ్రాన్స్ తలపడనున్నాయి. సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు హాట్ ఫేవరెట్ గా ఉండగా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఫ్రాన్స్ జట్టు చాలా బలంగా ఉంది. రేపటి తుది సమరం హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగుతుందని అందరూ అంచనా వేస్తున్న వేళ.. ఫ్రాన్స్ కు ఊహించని దెబ్బ తగిలింది.
ముగ్గురు కీలక ఆటగాళ్లు మ్యాచ్ కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వీరిలో స్టార్ డిఫెండర్లు రాఫెల్ వరానె, ఇబ్రహిమా కొనాటె, అటాకర్ కింగ్ స్లే కోమన్ ఆడే విషయంలో టెన్షన్ నెలకొంది. వీరు ముగ్గురూ అనారోగ్యం బారిన పడ్డారు. స్వల్ప వైరల్ సిండ్రోమ్ తో వీరు బాధపడుతున్నారు. దీంతో నిన్నటి ప్రాక్టీస్ సెషన్ లో కూడా వీరు పాల్గొనలేదు. మరోవైపు ఫ్రాన్స్ ఫార్వర్డ్ ఆటగాడు రాన్ డల్ కోలో మౌని మాట్లాడుతూ, వీరిలో జ్వరం లక్షణాలు ఉన్నప్పటికీ, అవి అంత తీవ్రమైనవి కావని, వీరు కోలుకుని జట్టులోకి వస్తారనే ఆశాభావంతో ఉన్నామని చెప్పాడు.