KTR: కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ పెద్ద అబద్ధం చెప్పారు: కేటీఆర్
- బల్క్ డ్రగ్ పార్కులపై పార్లమెంటులో కేంద్రం వెల్లడి
- తెలంగాణకు కేటాయించినట్టు నోటిమాటగానే చెప్పారన్న కేటీఆర్
- లిఖితపూర్వక సమాధానంలో తెలంగాణ పేరు లేదని ఆరోపణ
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. మన్సుఖ్ మాండవీయ పెద్ద అబద్ధం చెప్పారని కేటీఆర్ ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్కును ఏపీకి కేటాయిస్తున్నట్టు లిఖితపూర్వకంగా చెప్పారని, తెలంగాణకు కేటాయించినట్టు నోటిమాటగా చెప్పారని విమర్శించారు. తద్వారా తెలంగాణ గుండెకు గాయం చేశారని తెలిపారు.
అంతేకాదు, మన్సుఖ్ మాండవీయ తన అబద్ధాలతో పార్లమెంటును కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వకుండా తీరని అన్యాయం చేశారని, తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీకి జాతి ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు.
దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించగా... తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు మన్సుఖ్ మాండవీయ పార్లమెంటులో మౌఖికంగా తెలియజేశారు. కానీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాచారంలో మాత్రం బల్క్ డ్రగ్ పార్కులను ఏపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లకు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పైవిధంగా స్పందించారు.