Mancherial District: మంచిర్యాల సజీవ దహనం కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
- వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే కారణం
- చుట్టపు చూపుగా వచ్చి పిల్లలతో సహా మౌనిక మృత్యువాత
- పోలీసుల అదుపులో నలుగురు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని గుడిపెల్లిలో మొన్న అర్ధరాత్రి జరిగిన ఆరుగురి సజీవ దహనం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంటిలో చెలరేగిన మంటలు నిద్రిస్తున్న ఆరుగురిని బలితీసుకున్నాయి. పథకం ప్రకారమే ఈ ఘటన జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మసా పద్మ (45), శివయ్య (50) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. నాలుగు నెలల క్రితం ఓ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు నస్పూర్‌లో, రెండో కుమార్తె హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కుమార్తె అంత్యక్రియల కోసం మూడు నెలల క్రితం వచ్చిన పద్మ దంపతులు అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. సింగరేణిలో మజ్దూర్‌గా పనిచేస్తున్న శనిగారపు శాంతయ్య అలియాస్ సత్తయ్య(57)కు పద్మతో వివాహేతర సంబంధం ఉంది. అయన కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు.
కొండంపేటకు చెందిన నెమలికొండ మౌనిక (23) తన ఇద్దరు పిల్లలు ప్రశాంతి (2), హిమబిందు (4)తో కలిసి రెండు రోజుల క్రితం తన పెద్దమ్మ అయిన పద్మ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో వీరందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని ఊట్కూరుకు చెందిన శాంతయ్యకు పదేళ్ల క్రితం పద్మతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో కొంతకాలంగా ఆయన పద్మతోనే ఉంటున్నాడు. విషయం తెలిసిన శాంతయ్య భార్య సృజన నిలదీయడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఆరు నెలల్లో రెండుసార్లు హత్యాయత్నం
శాంతయ్యకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరూ నిరుద్యోగులే. ఈ క్రమంలో శాంతయ్య కనుక అన్‌ఫిట్‌గా ధ్రువీకరణ పొందితే వారసులకు ఉద్యోగం లభిస్తుంది. దీంతో అన్‌ఫిట్‌గా మారాలంటూ భార్య, పిల్లలు గత కొంతకాలంగా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య మనస్పర్థలు మరింత పెరిగాయి. మరోవైపు, శాంతయ్య తన జీతం డబ్బులు మొత్తాన్ని పద్మకే ఇస్తుండడంతోపాటు ఊట్కూరులో ఉన్న స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ. 25 లక్షలను కూడా ఆమెకే ఇచ్చినట్టు కుటుంబ సభ్యులు అనుమానించారు. దీంతో శాంతయ్యపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు శాంతయ్యపై హత్యాయత్నం జరిగినా ఆయన బయటపడ్డాడు. ఓసారి కిడ్నాప్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఇలాగైతే లాభం లేదని, వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్న సృజన.. ప్రియుడు సాయంతో వారి హత్యకు ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఇంటిలో పెట్రోలు పోసి నిప్పటించారు. కాగా, పెద్దమ్నను చూసేందుకు వచ్చి పిల్లలతో సహా మౌనిక మృత్యువాత పడడం అందరినీ కలచివేస్తోంది.
ముందే చంపేసి నిప్పు?
ఘటన జరిగిన ఇంటి వెనక సగం కాలిన టైర్లను పోలీసులు గుర్తించారు. వాటికి కొద్ది దూరంలో 20 లీటర్ల పెట్రోలు క్యాన్లు పడి వున్నాయి. దీంతో ఇంటి తలుపు సందులోంచి పెట్రోలు పోసి నిప్పటించినట్టు అనుమానిస్తున్నారు. అయితే, మంటలు చుట్టుముట్టినా లోపలి నుంచి ఎలాంటి అరుపులు వినిపించలేదని స్థానికులు చెబుతుండడాన్ని బట్టి.. వారికి తొలుత మత్తుమందు ఇచ్చి కానీ, లేదంటే హత్య చేసిన తర్వాత కానీ ఇంటికి నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.