Varadkar: ఐర్లాండ్ ప్రధాని పీఠం మరోసారి భారత సంతతి వ్యక్తి సొంతం
- రెండోసారి ప్రధానిగా ఎన్నికైన లియో వరద్కర్
- 2017లో ఓ పర్యాయం ప్రధానిగా పని చేసిన లియో
- ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించిన వైనం
భారత సంతతి వ్యక్తులు ప్రపంచ దేశాల రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికవగా, మన దేశాన్ని 200 ఏళ్లకు పైగా పాలించిన ఇంగ్లండ్ ప్రధాని పీఠాన్ని రిషి సునాక్ చేజిక్కించుకున్నారు. ఇంగ్లండ్ పొరుగునే ఉన్న ఐర్లాండ్ ప్రధాన మంత్రిగా భారత సంతతి వ్యక్తి లియో వరద్కర్ రెండోసారి ఎన్నికయ్యారు. 43 ఏళ్ల లియో ఇది వరకే ఒక పర్యాయం ఐర్లాండ్ ను పాలించారు. ఇప్పటికీ ఐర్లాండ్ ను పాలిస్తున్న పిన్న వయస్కుడిగా ఉన్నారు. 38 ఏళ్ల వయసులో 2017లో ఆయన తొలిసారి ప్రధాన మంత్రి అయ్యారు.
2022లో ఐర్లాండ్ లోని ప్రధాన పార్టీలైన ఫిల్ గేన్, మార్టిన్ ఫియన్నా ఫెయిల్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు లియోకు మరోసారి అవకాశం లభించింది. కాగా, లియోకు భారత ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. ‘రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లియోకు అభినందనలు. ఐర్లాండ్ తో మా చారిత్రక సంబంధాలు, రాజ్యాంగ విలువలను పంచుకోవడం, బహుముఖ సహకారానికి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తాము’ అని ట్వీట్ చేశారు. ఇరు దేశాల అర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆయనతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు.