Telangana: ఏపీ - తెలంగాణ మధ్య మరో నేషనల్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- కల్వకుర్తి నుంచి జమ్మలమడుగు వరకు జాతీయ రహదారి నిర్మాణం
- రూ. 4,706 వ్యయంతో రహదారి నిర్మాణం
- 2023 ఫిబ్రవరి తొలి వారంలో టెండర్ల ప్రక్రియ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. రూ. 4,706 కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కృష్ణానదిపై బ్రిడ్జ్ నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ఇప్పుడు నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ఈ జాతీయ రహదారిని తెలంగాణలో 91 కిలోమీటర్లు, ఏపీలో 164 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. మొత్తం ఏడు ప్యాకేజీల కింద రహదారి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 2023 ఫిబ్రవరి తొలి వారంలో టెండర్ల ప్రక్రియను చేపట్టి ఏడాదిన్నర కాలంలో పూర్చి చేయాలని కేంద్రం భావిస్తోంది.