Adani raod transport: ఓఆర్ఆర్ టోల్ హక్కుల కోసం అదానీ సహా దిగ్గజాల పోటీ!
- 30 ఏళ్ల కాలానికి టోల్ హక్కుల విక్రయం
- బిడ్ల దాఖలుకి జనవరి 16వ వరకు గడువు
- రూ.7,000-8,000 కోట్లు సమకూరతాయని అంచనా
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నగరంలోని అన్ని ప్రాంతాలను చుట్టే రహదారి వలయం. అవుటర్ నుంచి రాకపోకలను వేగంగా సాగించొచ్చు. ఓఆర్ఆర్ వెలుపల, చుట్టుపక్కల కూడా టౌన్ షిప్ లు వెలుస్తున్నాయి. ఈ అభివృద్ధి పనులతో ఓఆర్ఆర్ పై వాహనాల రద్దీ కూడా పెరుగుతోంది. దీంతో ఓఆర్ఆర్ ను ఇన్ ఫ్రా కంపెనీలు, పీఈ సంస్థలు బంగారు బాతుగా చూస్తున్నాయి. ఓఆర్ఆర్ టోల్ కలెక్షన్ కాంట్రాక్టు కోసం దిగ్గజ సంస్థలు పోటీ పడనున్నాయి.
అదానీ రోడ్ ట్రాన్స్ పోర్ట్, రెండు కెనడా ఫండ్స్, కేకేఆర్, ఎన్ఐఐఎఫ్ టోల్ హక్కుల కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. టోల్ హక్కుల విక్రయం ద్వారా రూ.7,000-8,000 కోట్లు సమకూరతాయని అంచనా. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో టోల్ ఆపరేట్, ట్రాన్స్ ఫర్ హక్కులను 30 ఏళ్ల కాలానికి ప్రభుత్వం లీజుకు పెట్టింది. వీటికి బిడ్లను ఆహ్వనించింది. 158 కిలోమీటర్ల పొడవైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ హక్కుల కోసం 12 సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని, వచ్చే నెలలో బిడ్లను సమర్పించొచ్చని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. బిడ్లను దాఖలు చేసేందుకు జనవరి 16 చివరి తేదీ. 24న బిడ్లను తెరిచి, 28న విజేతను ప్రకటించనున్నారు.