Taraka Ratna: ఎన్నికల్లో పోటీ చేస్తా.. మామయ్య అడుగుజాడల్లో నడుస్తా: నందమూరి తారకరత్న
- ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తారకరత్న ప్రకటన
- నందమూరి కుటుంబ సభ్యులు పదవులను కోరుకోరని వ్యాఖ్య
- ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమన్న తారకరత్న
సినీ నటుడు నందమూరి తారకరత్న సినిమాలలో నటించడం తగ్గినప్పటికీ... తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో మాత్రం బిజీగానే ఉంటారు. పార్టీ కోసం తన వంతు పని చేస్తూనే ఉంటారు. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తగా పని చేశానని, నాయకుడిని కూడా అవుతానేమో అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.
నందమూరి కుటుంబ సభ్యులు ఎలాంటి పదవులను కోరుకోరని, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని తారకరత్న అన్నారు. తాము ప్రజల సంక్షేమం కోసం పోరాడుతామని, పోరాడుతూనే ఉంటామని చెప్పారు. తన బాబాయ్ బాలకృష్ణ తనకు ఆదర్శమని చెప్పారు. మామయ్య చంద్రబాబు గొప్ప నాయకుడని, ఆయన నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. మామయ్యకు అండగా ఉంటామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామంలో తన తాత, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని తారకరత్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పైవ్యాఖ్యలు చేశారు.