Reliance Jio: భారీ సంఖ్యలో యూజర్లను ఆకర్షిస్తున్న రిలయన్స్ జియో
- అక్టోబర్ నెలలో కొత్తగా 14 లక్షల మంది జియో నెట్ వర్క్ లో చేరిక
- ఎయిర్ టెల్ సంపాదించిన కొత్త యూజర్లు 8.05 లక్షల మంది
- 35 లక్షల యూజర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్
టెలికం మార్కెట్లో స్థిరీకరణ కొనసాగుతూనే ఉంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ ప్రతి నెలా కొత్త చందాదారులను ఆకర్షిస్తూ మరింత బలపడుతుంటే, వీటి తర్వాతి స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా చందాదారులను కోల్పోతూ బక్కచిక్కుతోంది. అక్టోబర్ నెలకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
రిలయన్స్ జియో అక్టోబర్ నెలలో కొత్తగా 14 లక్షల మంది యూజర్లను సంపాదించింది. అంతకుముందు నెల సెప్టెంబర్ లో ఈ సంస్థలోకి వచ్చిన కొత్త చందాదారులు 7.24 లక్షలుగా ఉన్నారు. ఇక భారతీ ఎయిర్ టెల్ అక్టోబర్ లో 8.05 లక్షల కొత్త చందాదారులను ఆకర్షించింది. అంతకుముందు నెల సెప్టెంబర్ లో ఇలా చేరిన కొత్త చందాదారులు 4.12 లక్షలుగా ఉన్నారు. ఇక వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్ లో 40.11 లక్షల మంది యూజర్లను కోల్పోగా, అక్టోబర్ లోనూ 35.09 లక్షల మందిని నష్టపోయింది.
అక్టోబర్ చివరికి వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా (వైర్ లెస్) 21.48 శాతానికి (సెప్టెంబర్ లో 21.75 శాతం) క్షీణించింది. జియో వాటా 36.85 శాతానికి, ఎయిర్ టెల్ వాటా 31.92 శాతానికి మెరుగుపడింది. జియో మొత్తం చందాదారుల్లో యాక్టివ్ యూజర్లు (ఎప్పటికప్పుడు రీచార్జ్ చేసుకునే వారు) 91.93 శాతంగా ఉన్నారు. కానీ, ఎయిర్ టెల్ ఈ విషయంలో 98.56 శాతం యాక్టివ్ యూజర్లతో మొరుగైన స్థానంలో ఉంది. భారీ అప్పులతో వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్ విస్తరణపై పెద్దగా పెట్టుబడులు పెట్టలేని పరిస్థితులను ఎదుర్కొంటోంది. నెట్ వర్క్ సమస్యలతో యూజర్లు క్రమంగా వెళ్లిపోతున్నారు.