BRS: ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తే కారణమా?
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి నివాసంలో సమావేశమైన శాసన సభ్యులు
- హాజరైన కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు
- వీరి అనూహ్య భేటీపై తెరపైకి అనేక ఊహాగానాలు
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్కాజ్‌గిరి శాసన సభ్యుడు మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో భేటీ అవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్), భేతి సుభాష్ రెడ్డి (ఉప్పల్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కొంపల్లిలోని మైనంపల్లి నివాసంలో వీరు మంతనాలు సాగించారు. ఉదయం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక్కచోటుకు చేరడంపై ఉత్కంఠ మొదలైంది. దాదాపు నాలుగైదు గంటల పాటు వీరంతా భేటీ అయ్యాయి. అల్పాహారం కోసం ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానించినట్టు మైనంపల్లి చెప్పినా.. తమ జిల్లాల పరిధిలోని ప్రస్తుత రాజకీయాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్న సదరు ఎమ్యెల్యేలు రాబోయే ఎన్నికల నేపథ్యంలో కార్యచరణ కోసమే సమావేశం అయినట్టు తెలుస్తోంది. తమ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, పదవులన్నీ ఒకే నియోజకవర్గానికి, మంత్రి అనుచరులకే ఇప్పించుకుంటున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. ఇక, ఇది రహస్య మీటింగ్ కాదని, కుటుంబంలాంటి పార్టీలో ఎన్నో ఉంటాయని ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యానించారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో మైనంపల్లి మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కుమారుడు రోహిత్ ను నిలబెట్టాలని భావిస్తున్నారని ఇదే విషయాన్ని తాజా భేటీలో తోటి ఎమ్మెల్యేలతో చర్చించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.