APSRTC: సంక్రాంతి బస్సులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆఫర్.. రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ
- సంక్రాంతిని పురస్కరించుకుని 6,400 ప్రత్యేక బస్సులు
- అదనపు బాదుడుకు స్వస్తి పలికిన ఏపీఎస్ ఆర్టీసీ
- గణనీయంగా పెరిగిన ఆర్టీసీ ఆదాయం
సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ 6,400 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే, ఈసారి ఈ స్పెషల్ బస్సుల్లో ‘అదనపు’ బాదుడుకు స్వస్తి పలికిన అధికారులు.. ప్రత్యేక రాయితీ కూడా కల్పించారు. జనవరి 6వ తేదీ నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే, పండుగ రద్దీని బట్టి 15 నుంచి 18 వరకు ఆయా బస్ డిపోల నుంచి బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఇక రానుపోను టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు 10 శాతం రాయితీ ప్రకటించారు.
క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పొరుగు, ఇతర రాష్ట్రాల నుంచి సంక్రాంతికి వచ్చే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి పండుగ ముందు 3,120 బస్సులు, పండుగ తర్వాత 3,280 బస్సులు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. బస్సు బయలుదేరిన తర్వాత కూడా అందుబాటులో ఉన్న సీట్లను బట్టి యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి ఆర్టీసీని ఆదరించే ప్రయాణికుల సంఖ్య 63 శాతం నుంచి 68 శాతానికి పెరిగినట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గతేడాది నవంబరు నాటికి రూ. 2,623 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ. 3,866 కోట్లకు పెరిగినట్టు చెప్పారు. కార్గో ఆదాయంలోనూ భారీ పెరుగుదల కనిపించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 122 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇంకా మరో మూడు నెలలు మిగిలి ఉండగానే ఆదాయం రూ. 119 కోట్లు దాటేసింది.