china: రోజుకు రెండొందల దాకా శవాలు.. బీజింగ్ లోని ఓ క్రిమటోరియంలో విపరీతమైన రద్దీ.. వీడియో ఇదిగో

60 percent Of China Likely To Get Covid says Top Epidemiologist
  • ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు ఫుల్.. నేల పైనా రోగులకు చికిత్స
  • చైనాలో కరోనా బీభత్సం.. రాబోయే 3 నెలల్లో 60% జనాభాకు వైరస్!
  • ప్రజలను పట్టించుకోవట్లేదంటూ చైనా ఎపిడమాలజిస్ట్ విమర్శ
ప్రజలు ఆందోళనలు చేయడంతో చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తేసింది.. ఆంక్షలు ఎత్తేసాక వైరస్ కు గేట్లు తెరిచినట్టయిందని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో దాదాపుగా అన్ని ఆసుపత్రులలో రద్దీ నెలకొందని చెబుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులలో బెడ్లు నిండిపోవడంతో పాటు బెడ్ల మధ్య కూడా పేషెంట్లను పడుకోబెట్టి చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వైరస్ మరణాలను చైనా ప్రభుత్వం చాలా తక్కువ చేసి చూపుతోందని ఎరిక్ ఫెయిగిల్ డింగ్ అనే టాప్ ఎపిడమాలజిస్ట్ ఆరోపిస్తున్నారు. ఒక్క బీజింగ్ విషయమే తీసుకుంటే ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం ఈ సిటీలో కరోనాతో చనిపోతున్న వాళ్ల సంఖ్య ఇరవై లోపే.. అదే సమయంలో సిటీలోని ఓ క్రిమటోరియంలో పరిస్థితి భిన్నంగా ఉందంటున్నారు. క్రిమటోరియానికి రోజుకు సుమారు 200 శవాల దాకా వస్తున్నాయని, జీరో కొవిడ్ ఆంక్షలు ఎత్తేశాక తమకు పని ఒత్తిడి బాగా పెరిగిపోయిందని అక్కడి సిబ్బంది వాపోతున్నారని ఎరిక్ వివరించారు.

వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే.. రాబోయే మూడు నెలల్లో చైనాలోని 60 శాతం జనాభా వైరస్ బారిన పడతారని ఎరిక్ హెచ్చరించారు. జీరో కోవిడ్ ఆంక్షలపై ఆందోళన చేయడంతో చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని ఆరోపించారు. వైరస్ బారినపడే వాళ్లు పడనీ, చనిపోయే వాళ్లను చనిపోనీ అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎరిక్ విమర్శించారు. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజింగ్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు సంబంధించిన వీడియోను ఎరిక్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
china
COVID19
virus deaths
china hospitals

More Telugu News