Nepal: 16 భారత ఫార్మా కంపెనీలపై నిషేధం విధించిన నేపాల్
- ఆయా కంపెనీలు ప్రమాణాలు పాటించడంలేదన్న నేపాల్
- మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని వెల్లడి
- నిషేధిత కంపెనీల జాబితాలో బాబా రాందేవ్ సంస్థ
నేపాల్ ప్రభుత్వం భారత్ నుంచి ఔషధ దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ కు చెందిన 16 ఫార్మా కంపెనీలపై నిషేధం విధించింది. ఈ కంపెనీలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాలను పాటించడంలేదని నేపాల్ ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని, ఆయా కంపెనీలు మరోసారి దరఖాస్తు చేసుకుంటే పునఃపరిశీలిస్తామని నేపాల్ ఔషధ నియంత్రణ విభాగం పేర్కొంది. నేపాల్ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో చేర్చిన ఫార్మా సంస్థల్లో జైడస్ లైఫ్ సైన్సెస్, బాబా రాందేవ్ కు చెందిన దివ్య ఫార్మసీ కూడా ఉన్నాయి.
ప్రస్తుతం భారత్ కు చెందిన కొన్ని కంపెనీలు మాత్రమే అనుమతి పొందాయని, చాలా కొత్త కంపెనీలు అనుమతుల కోసం వేచి ఉన్నాయని నేపాల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (డీడీఏ) సీనియర్ అధికారి కేసీ సంతోష్ వెల్లడించారు.
రేడియంట్ పేరెంటరల్స్, మెర్క్యురీ ల్యాబొరేటరీస్, అలయన్స్ బయోటెక్, కాప్టాబ్ బయోటెక్, ఆగ్లోమెడ్, జీ ల్యాబొరేటరీస్, డాఫోడిల్స్ ఫార్యాస్యూటికల్స్, జీఎల్ఎస్ ఫార్మా, యూనిజూల్స్ లైఫ్ సైన్సెస్, కాన్సెప్ట్ ఫార్మాస్యూటికల్స్, శ్రీ ఆనంద్ లైఫ్ సైన్సెస్, దయాళ్ ఫార్మాస్యూటికల్స్, మాక్యూర్ ల్యాబొరేటరీస్, మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ నేపాల్ ప్రభుత్వ నిషేధానికి గురైన ఇతర భారత్ ఫార్మా కంపెనీలు.