Team India: సిరీస్ ఓడినా.. ఎన్నో నేర్చుకున్నాం: భారత మహిళా క్రికెట్ కెప్టెన్
- ఐదో టీ20లో 54 పరుగుల తేడాతో భారత్ పరాజయం
- దీప్తి శర్మ ఒంటరి పోరాటం వృథా
- 4–1తో సిరీస్ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా అమ్మాయిలు
స్వదేశంలో భారత మహిళల జట్టు మరోసారి నిరాశ పరిచింది. ఆస్ట్రేలియాతో మంగళవారం రాత్రి జరిగిన ఐదో టీ20లోనూ పరాజయం పాలై ఓటమితో సిరీస్ ను ముగించింది. హీథర్ గ్రహమ్ (4/8) హ్యాట్రిక్‌తో ఆష్లే గార్డ్‌నర్ (32 బంతుల్లో 66 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్), గ్రేస్ హ్యారిస్ (35 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధశతకాలతో రాణించడంతో ఐదో పోరులో ఆసీస్ 54 రన్స్ తేడాతో భారత్ ను ఓడించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది.
చివరి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అంజలి శ్రావణి, దీప్తి శర్మ, షఫాలీ వర్మ, దేవిక తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (34 బంతుల్లో 53; 8 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఓపెనర్ స్మృతి మందన (4), షఫాలీ వర్మ (13), హర్లీన్ డియోల్ (24), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (12), రిచా ఘోష్ (10) నిరాశ పరిచారు.
కాగా, ఈ సిరీస్ లో ఓడినా తాము ఎన్నో నేర్చుకున్నామని భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. ప్రతీ మ్యాచ్ లో ప్రత్యర్థికి మంచి పోటీ ఇచ్చామని, గతంతో పోలిస్తే జట్టు ప్రదర్శనలో మెరుగుదల కనిపించిందని తెలిపింది. ‘ఆస్ట్రేలియా వాళ్లు ఎలా ఆడుతారో మాకు తెలుసు. మేము వారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాము. వారి మాదిరిగా మేం కూడా విరివిగా బౌండ్రీలు కొట్టాలనుకున్నాం. చేసి చూపించాం. మేం చాలా విభాగాల్లో అభివృద్ధి చెందినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని చెప్పుకొచ్చింది.