yanamala: తన సంక్షేమమే ప్రజా సంక్షేమమని జగన్ విశ్వాసం: యనమల

tdp polite beauro member yanamala ramakrishnudu fires on government ads to saakshi paper

  • జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షల పేరుతో సాక్షి పేపర్ కు ప్రభుత్వ, ప్రైవేటు యాడ్స్
  • రూ.50 కోట్లు జగన్ అక్రమంగా ఆర్జించారన్న టీడీపీ నేత
  • యాడ్స్ విషయంలో సుప్రీం తీర్పును, కేంద్రం నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శ

ప్రజా సంక్షేమమే తన ఊపిరి అంటూ నిరంతరం అబద్ధాలు వల్లిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి.. తన సంక్షేమమే ప్రజా సంక్షేమమని బలంగా నమ్ముతారని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా సాక్షి పత్రిక, సాక్షి టీవికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పేరుతో భారీగా యాడ్స్ ఇచ్చుకున్నారని ఆరోపించారు. 

ఈ ప్రకటనల పేరుతో రూ.50 కోట్లు అక్రమంగా ఆర్జించారని యనమల అన్నారు. ప్రభుత్వ ప్రకటనల జారీకి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆరోపించారు. తన సంక్షేమమే ప్రజా సంక్షేమమని జగన్‌రెడ్డి గట్టిగా విశ్వసిస్తాడనడానికి ఇదొక ఉదాహరణ అని యనమల చెప్పారు.

ప్రజలకు మేలు చేకూర్చే సమాచారాన్ని అందించడానికి ప్రభుత్వం తరఫున జారీ చేయవలసిన ప్రకటనలను తన వ్యక్తిగత ఇమేజీ పెంచుకోవడానికి, పార్టీ ప్రయోజనాల కోసం నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారని జగన్ పై యనమల ధ్వజమెత్తారు. గుంతలమయంగా మారిన రహదారులను బాగుచేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు కానీ ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షల ప్రకటనల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని యనమల మండిపడ్డారు.

జీతాలు కూడా ఇవ్వలేని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేని ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నా సరే సొంత జేబులు నింపుకోవడానికి అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ ముఖ్యమంత్రి వాడుకుంటున్నారని యనమల ఆరోపించారు. ఈ విధంగా ప్రభుత్వ ప్రకటనల పేరిట కొనసాగుతున్న దోపిడీని ఆపాలని తెలుగుదేశం పార్టీ తరఫున యనమల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పులతో అభివృద్ధి కుంటుపడిన పరిస్థితుల్లో ప్రతి రూపాయినీ జాగ్రత్తగా వినియోగించాలనే విజ్ఞత జగన్‌రెడ్డికి ఇప్పటికైనా కలగాలని టీడీపీ కోరుకుంటోందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News