Srinivasarao: ఏసుక్రీస్తు కృప వల్ల కరోనా వ్యాప్తి తగ్గింది: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
- ఇటీవల సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన శ్రీనివాసరావు
- తాజా వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కిన వైనం
- ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఇటీవల సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి విమర్శల పాలైన తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకెక్కారు. ఏసు క్రీస్తు వల్లే కరోనా వ్యాప్తి తగ్గిందని వ్యాఖ్యానించారు. శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండున్నర సంవత్సరాల నుంచి కొవిడ్ మానవజాతి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ప్రపంచ మానవాళిని కొవిడ్ తరిమి తరిమి భయపెట్టిందని, ఇవాళ దాన్నుంచి అందరం పూర్తిగా విముక్తి పొందామని తెలిపారు.
"మనం అందించిన సేవలతో కాదు... ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గింది. మంచిని ఆచరించాలని, మంచిని ప్రేమించాలని, మంచిని గౌరవించాలని చెప్పే మిగిలిన అన్ని జాతుల, ధర్మాల ప్రబోధాలను మనందరం ముందుకు తీసుకుపోవడం వల్ల మానవజాతిని కాపాడుకోగలిగాం. మనిషిగా పుట్టేందుకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు' అని శ్రీనివాసరావు వివరించారు.