Chandrababu: నేను కోరుకున్నది అధికారం కాదు... మీ అభిమానం: ఖమ్మంలో చంద్రబాబు
- ఖమ్మంలో టీడీపీ శంఖారావం సభ
- హాజరైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
- యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని వెల్లడి
- టీడీపీ 40 ఏళ్లు పూర్తిచేసుకుని భవిష్యత్తుకు నాంది పలుకుతోందని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖమ్మంలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో ప్రసంగించారు. టీడీపీ సభకు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారని వెల్లడించారు. టీడీపీ జెండా పట్టుకుని పార్టీ రుణం తీర్చుకుంటామని యువత ముందుకువచ్చారని తెలిపారు.
టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని, భవిష్యత్తుకు నాంది పలకబోతోందని వివరించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు శక్తి అని కీర్తించారు. చిరకాలం తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
రూ.2 కిలో బియ్యంతో ఆహార భద్రతకు బీజం వేసింది ఎన్టీఆరేనని తెలిపారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం అందించారని చంద్రబాబు వివరించారు. మండల వ్యవస్థ, సింగిల్ విండో విధానం అమలు చేశారని, పేదలకు పక్కా భవనాలు నిర్మించి ఇచ్చారని తెలిపారు.
తాను కోరుకున్నది అధికారం కాదని, ప్రజల అభిమానం అని వెల్లడించారు. ఎన్నికలు, ఓట్ల కోసం ఎప్పుడూ పనిచేయలేదని స్పష్టం చేశారు. మీ ఆత్మబంధువుగా ఉండాలని నేను కోరుకుంటున్నా.. అని ఉద్ఘాటించారు.
వయసులో పెద్దవాడినైనా యువత కంటే ముందు చూపుతో ఆలోచిస్తానని చెప్పారు. ఐటీ రంగం ప్రాధాన్యతను 25 ఏళ్ల క్రితమే గుర్తించానని చంద్రబాబు వెల్లడించారు. యువత కోసం ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడీస్థాయిలో ఉందంటే అందుకు కారణం ఎవరు? అంటూ సభికులను అడిగారు.
"ఓ దశలో మైక్రోసాఫ్ట్ రంగప్రవేశం చేసింది. బిల్ గేట్స్ ఇంటర్నెట్ విప్లవం తీసుకువచ్చాడు. ఆ సమయంలో నేను బిల్ గేట్స్ ను కలుద్దామని అనుకున్నా. మైక్రోసాఫ్ట్ గనుక హైదరాబాదుకు వస్తే, ఇతర కంపెనీలు కూడా వస్తాయని అనుకున్నా. కానీ బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. కేవలం కొన్ని నిమిషాలు సమయం ఇమ్మని పదేపదే అడిగాను. దాంతో అపాయింట్ మెంట్ ఇచ్చారు.
అయితే బిల్ గేట్స్ ఒకమాట అన్నాడు... నేను మందు పార్టీ (కాక్ టెయిల్ పార్టీ) ఇస్తున్నాను... వచ్చేట్టయితే రండి అని పిలిచాడు. నేనప్పుడు ఒకటే మాట చెప్పాను... ఆ పార్టీకి నేను గనుక వస్తే నన్ను కూడా తాగుబోతుల క్లబ్ లో చేర్చేస్తారు.... ఎవరూ ఓట్లేయరు అని ఆయనకు ముందే చెప్పేశాను. బిల్ గేట్స్ 10 నిమిషాలు అపాయింట్ మెంట్ ఇస్తే.. భారతీయుల మేధాశక్తి ఎలాంటిదో ఆయనకు వివరించాను. మనవాళ్ల ఐటీ శక్తి సామర్థ్యాలను ఆయన కూడా అంగీకరించారు. ఇప్పుడు కూడా నేను అదే చెబుతున్నా... డిజిటల్ సత్తాలో మనతో పోటీ పడేవాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా! 25 ఏళ్ల కిందట కూడా నేనే ఇదే చెప్పాను" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.