GVL Narasimha Rao: బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్రానికి లేదంటూ వైసీపీ, టీడీపీలు కాపులను మోసం చేశాయి: జీవీఎల్
- కాపులకు రిజర్వేషన్ అంశంపై పార్లమెంటులో ప్రస్తావన
- జీవీఎల్ ప్రశ్నలకు బదులిచ్చిన కేంద్రం
- ఓబీసీ రిజర్వేషన్లపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందని వెల్లడి
ఏపీలో కాపులకు రిజర్వేషన్ల అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు నేడు పార్లమెంటులో ప్రస్తావన తెచ్చారు. ఆయన కేంద్రాన్ని నాలుగు ప్రశ్నలు అడిగారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, విద్యాసంస్థల్లోనూ ఓబీసీ రిజర్వేషన్లకు కేంద్రం అనుమతి అవసరమా? రిజర్వేషన్ల అమలు ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అంటూ ప్రత్యేక జాబితాలు ఉన్నాయా? ఏపీలో 2019 చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం ఇస్తున్నారు... మళ్లీ అందులో 5 శాతం కాపులకు కేటాయించారు... ఇది న్యాయపరంగా చెల్లుబాటు అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు బీసీ రిజర్వేషన్ వర్తింపజేసేందుకు ఏవైనా విధివిధానాలు ఉన్నాయా? అని జీవీఎల్ ప్రశ్నించారు.
అందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమిక్ లిఖితపూర్వకంగా బదులిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఏదైనా కులానికి ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే అందుకు కేంద్రం అనుమతి అవసరంలేదని స్పష్టం చేశారు. ఇక, కేంద్రం 1993లో ఓబీసీ రిజర్వేషన్లు తీసుకువచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు వెనుకబడిన కులాల జాబితాలు ఉన్నాయని వెల్లడించారు.
రాజ్యాంగంలో 103వ సవరణ ద్వారా 2019 చట్టంతో ఆర్థికంగా వెనుకబడి వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం గరిష్ఠంగా 10 శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చని మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహాయ మంత్రి వివరణ ఇచ్చారు.
రాజ్యాంగంలో 105వ సవరణ అనుసరించి ఆర్టికల్ 342ఏ(3) ప్రకారం... సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్ఈబీసీ)కు రిజర్వేషన్లు వర్తింపజేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని, అంతేకాకుండా, ఎస్ఈబీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత జాబితాను నిర్వహించవచ్చని భౌమిక్ తెలిపారు.
దీనిపై జీవీఎల్ స్పందిస్తూ... ఏపీలో కాపులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వైసీపీ, టీడీపీ కాపులను పూర్తిగా మోసం చేశాయని విమర్శించారు. ఇది కాపులపై ఆ రెండు పార్టీలకు ఉన్న కపట ప్రేమకు నిదర్శనం అని పేర్కొన్నారు.