Rajasthan: ఒక్కడైనా మగపిల్లాడు కావాలనుకుంటే.. ఒకే కాన్పులో ఏకంగా ముగ్గురు పుట్టారు!
- రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాలో ఘటన
- ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలు
- కుటుంబ సభ్యుల ఒత్తిడితో మగపిల్లాడి కోసం గర్భం దాల్చిన మహిళ
- ఒక్కొక్కరు కేజీ బరువుతో పుట్టడంతో వైద్యుల ప్రత్యేక శ్రద్ధ
రాజస్థాన్‌లో అద్భుతం జరిగింది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు ఓ తల్లి జన్మనిచ్చింది. విచిత్రంగా ముగ్గురూ అబ్బాయిలే కావడం విశేషం. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. విషయం తెలిసిన చుట్టుపక్కల వారు పిల్లలను చూసేందుకు పోటెత్తుతున్నారు. రాష్ట్రంలోని దుంగార్పూర్ జిల్లాలోని పిండావల్ గ్రామానికి చెందిన జయంతిలాల్-బదూదేవి దంపతులు. వీరికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండడంతో మగపిల్లాడి కోసం పరితపించిపోయారు. ఈసారైనా బాబు పుట్టాలని కనిపించిన దేవుళ్లందరికీ మొక్కుకున్నారు. ఎట్టకేలకు వారి మొరకు ఫలితం దక్కింది.
ఇటీవల గర్భం దాల్చిన బదూదేవి గత నెల 25న సగ్వారాలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చేరింది. అయితే, నెలలు పూర్తిగా నిండకుండానే ఆ తర్వాతి రోజే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఒక్కొక్కరు కేజీ బరువు మాత్రమే ఉండడంతో శిశువులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో వైద్యులు వారికి కృత్రిమంగా ఆక్సిజన్ అందించి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. విషయం తెలిసిన చుట్టుపక్కల వారు పిల్లలను చూసేందుకు తరలివస్తున్నారు.
బదూదేవికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, కుమారుడు కావాలన్న కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమె గర్భవతి అయినట్టు బదూదేవికి చికిత్స అందించిన డాక్టర్ ఇస్మాయిల్ తెలిపారు. ఇప్పుడామెకు ఏకంగా ముగ్గురు (ట్రిప్లెట్స్) మగ పిల్లలు జన్మించినట్టు చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయన్నారు. ముగ్గురు పిల్లలను ఏడాదిపాటు కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, గతంలో అజ్మేర్‌లోనూ ఓ మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్టు వైద్యులు తెలిపారు.