Nayanthara: మూవీ రివ్యూ: 'కనెక్ట్'
- ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'కనెక్ట్'
- నయనతార ప్రధాన పాత్రను పోషించిన సినిమా
- హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
- బలహీనమైన కథనం
- ఒక ఇంట్లో రెండు పాత్రల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు
- తక్కువ బడ్జెట్ లో భయపెట్టే ప్రయత్నం
హారర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన నయనతార సినిమాలు దాదాపు మంచి వసూళ్లను రాబట్టాయి. అందువలన తన సొంత బ్యానర్లో సినిమా చేయడానికి ఆమె ఈ జోనర్ నే ఎంచుకుంది. నయనతార ఈ తరహా జోనర్లో మంచి కథలను ఎంచుకుంటుందనే నమ్మకం ఆడియన్స్ కి ఉంది. వాళ్లందరిలో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తూ ఆమె 'కనెక్ట్' సినిమా చేసింది. పోస్టర్స్ తోను .. టీజర్ తోను ఈ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేయగలిగారు.
గతంలో నయనతారకి 'మాయ' (మయూరి) సినిమాతో హిట్ ఇచ్చిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాకి దర్శకుడు. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా కంటెంట్ .. టేకింగ్ .. నయనతార నటనను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. అందువలన ఆ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పట్ల కుతూహలాన్ని కనబరిచారు. ఈ సినిమా ఎంతవరకూ వారికి 'కనెక్ట్' అయిందనేది ఇప్పుడు చూద్దాం.
సుసాన్ (నయనతార) జోసెఫ్ బెనాయ్ (వినయ్ రాయ్) భార్యాభర్తలు. వారి ఒక్కగానొక్క కూతురే అనా జోసెఫ్ (హానియా నసీఫా). సుసాన్ తండ్రి శామ్యుల్ (సత్యరాజ్) వేరే ఊళ్లో ఉంటూ, తన కూతురుకి ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటూ ఉంటాడు. సుసాన్ భర్త జోసెఫ్ ఒక డాక్టర్. కరోనా సమయంలో ఎంతోమంది రోగులను బ్రతికించిన ఆయన, దాని బారిన పడి చనిపోతాడు. దాంతో సుసాన్ .. అనా ఇద్దరూ కుంగిపోతారు.
ఒక రోజున తన తండ్రి ఆత్మతో మాట్లాడటానికి అనా జోసెఫ్ ఒక చిన్న ప్రక్రియ చేస్తుంది. ఆ ప్రయత్నం వికటించి మరో ప్రేతాత్మకి ఆమె పిలుపు కనెక్ట్ అవుతుంది. అదే సమయంలో సుసాన్ .. అనా జోసెఫ్ ఇద్దరూ కూడా కరోనా బారిన పడతారు. 14 రోజుల పాటు ఆ ఇల్లు దాటకుండా ఉండిపోతారు. అనా జోసెఫ్ తన గదిలో ఒంటరిగా ఉంటూ ఉంటుంది. ఆకలి లేదని చెప్పడం .. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం వంటివి చేస్తుంటుంది. తండ్రి మరణం .. కరోనా బారిన పడటం వలన కావొచ్చునని సుసాన్ అనుకుంటుంది.
అయితే అనా జోసెఫ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వీడియో కాల్ చేసిన లేడీ డాక్టర్ తో ఆమె మలయాళంలో మాట్లాడుతుంది. మలయాళమే తెలియని తన మనవరాలు ఆ భాష ఎలా మాట్లాడిందంటూ శామ్యూల్ ఆలోచనలో పడతాడు. అతనికి అనుమానం రావడంతో చర్చి ఫాదర్ ను రంగంలోకి దింపుతాడు. తన మనవరాలు ఒక ప్రేతాత్మ చేతిలో బందీగా ఉందన్న విషయం అప్పుడు అతనికి అర్థమవుతుంది. అదే విషయాన్ని వీడియో కాల్ ద్వారా సుసాన్ కి చెబుతాడు. లాక్ డౌన్ కారణంగా వీళ్లు బయటికి వెళ్లే పరిస్థితి లేదు. బయటివారు లోపలికి వచ్చే అవకాశం లేదు. అప్పుడు ఆ తండ్రీ కూతుళ్లు ఏం చేస్తారు? అనేదే కథ.
దర్శకుడు అశ్విన్ శరవణన్ కి ఈ తరహా కథలపై మంచి పట్టుంది. నయనతారతో అతని సినిమా అనగానే అంతా కూడా 'మాయ' రేంజ్ లో ఊహించుకుంటారు. అలాంటి ఊహతో థియేటర్ కి వెళ్లినవారికి మాత్రం నిరాశ తప్పదు. ఎందుకంటే ఈ సినిమాను ఏ రకంగా కూడా 'మాయ' సినిమాతో పోల్చలేం. 'మాయ' తరహా స్క్రీన్ ప్లే ఆశించినవారికి ఆమడ దూరంలో కూడా అది కనిపించదు.
ఈ కథ అంతా కూడా ఒక ఇంట్లోనే జరుగుతుంది. కరోనా .. హోమ్ క్వారంటైన్ కారణం చెప్పేసి, దర్శకుడు ఆ ఇంట్లోకి ఏ పాత్రను రానివ్వలేదు. దెయ్యం ఆవహించిన కూతురు .. కూతురును మామూలు మనిషిని చేయడానికి తపించే తల్లి .. ఈ ఇద్దరి మధ్యనే కథ నడుస్తుంది. ఇక వీడియో కాల్స్ ద్వారా ఆమెకి హెల్ప్ చేసే పాత్రల్లో తండ్రి .. చర్చి ఫాదర్ కనిపిస్తారు. ఈ నాలుగు పాత్రలతో కథను నడిపిస్తూ, నాలుగు గోడల మధ్యనే భయపెట్టడానికి దర్శకుడు ప్రయత్నించాడు.
తల్లీ కూతుళ్లు హోమ్ క్వారంటైన్ లో ఉన్న 14 రోజుల్లో ఏ రోజున ఏం జరుగుతుందనేది చూపిస్తూ దర్శకుడు ప్రేక్షకులను ఆ ఇంట్లో తిప్పుతుంటాడు. ఒక ఇంట్లో ఏం జరుగుతుందనేది .. థియేటర్లో కూర్చుని చూస్తున్నట్టుగా ఉంటుంది. దర్శకుడు టేకింగ్ కి వంకబెట్టవలసిన అవసరం లేదు. అలాగే నయనతార నటన గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు.
అయితే కథాకథనాల్లో బలం లేదు .. నయనతార ఇంటి గడపదాటి కథ బయటికి వెళ్లలేదు. రెండు పాత్రల మధ్య జరిగే కథను అలా చూస్తుండటం కాస్త అసహనాన్ని కలిగిస్తుంది. ఇతర పాత్రలు వీడియో కాల్స్ ద్వారా ఎంట్రీ ఇస్తూ కొంత విసుగు పుట్టిస్తాయి. ఇక ఈ సినిమాలో భయపెట్టే అంశమేదైనా ఉందంటే అది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. పృథ్వీ చంద్రశేఖర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. అందుకు మణికంఠన్ కృష్ణమాచారి కెమెరా పనితనం కొంత తోడైంది. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ ఫరవాలేదు.
ఈ సినిమా చూడగానే నయనతారలో గ్లామర్ పూర్తిగా తగ్గిందని అనిపిస్తుంది. ఆమె భయపడే సన్నివేశాలు కూడా అంతగా ఏమీ లేవు. ఆ దిశగా ఆమె నుంచి ఎక్స్ ప్రెషన్స్ ను రాబట్టే ప్రయత్నం కూడా జరగలేదు. నయనతార కూతురుగా ప్రధానమైన పాత్రను పోషించిన అమ్మాయిని కూడా ఆడియన్స్ కి సరిగ్గా రిజిస్టర్ చేయలేదు. నయనతార క్రేజ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ రెండింటినీ తీసి పక్కన పెడితే, ఈ సినిమా 'కనెక్ట్' కావడం కష్టమే అనిపిస్తుంది.
నయనతారకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ఇటు కోలీవుడ్ నుంచి సత్యరాజ్ .. బాలీవుడ్ నుంచి అనుపమ్ ఖేర్ ఇద్దరూ కూడా గొప్ప ఆర్టిస్టులు. అంతమాత్రాన ఇది పెద్ద సినిమా అని చెప్పలేం. నాలుగు ప్రధానమైన పాత్రలతో ఒక ఇంట్లో నడిచిన ఈ సినిమా బడ్జెట్ పరంగా గానీ .. నిడివి పరంగా గాని పెద్దది కాదు. నయనతారకి ఉన్న స్టార్ ఇమేజ్ తో థియేటర్స్ కి రప్పించి, చిన్న సినిమాను చూపించి పంపించినట్టుగా అనిపిస్తుంది.