Kasani Jnaneshwar: ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నవాళ్లు ఒకప్పుడు టీడీపీలో ఒకటో తరగతి చదివినవాళ్లే: కాసాని జ్ఞానేశ్వర్
- నిన్న ఖమ్మంలో టీడీపీ శంఖారావం సభ
- చంద్రబాబు ప్రసంగం
- విమర్శలు కురిపించిన తెలంగాణ మంత్రులు
- మంత్రులు వాస్తవాలు తెలుసుకోవాలన్న కాసాని
ఖమ్మంలో టీడీపీ శంఖారావం సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు.
ఖమ్మం సభతో బీఆర్ఎస్ కు అభద్రతా భావం మొదలైందని, అందుకే మంత్రులు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నేతలందరూ ఒకప్పుడు టీడీపీలో ఒకటో తరగతి చదివినవాళ్లేనని కాసాని జ్ఞానేశ్వర్ వ్యాఖ్యానించారు. మంత్రులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
హైదరాబాదులో ఐటీ, ఇతర రంగాల అభివృద్ధికి చంద్రబాబు బాటలు వేశారని కేసీఆర్ అనలేదా? వ్యాక్సిన్ల తయారీ కేంద్రంగా పేరుగాంచిన జీనోమ్ వ్యాలీకి రూపకల్పన చేసింది చంద్రబాబేనని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా అనలేదా? అని జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు. ఖమ్మం సభలో చంద్రబాబు వ్యాఖ్యల్లో తప్పుబట్టడానికేమీ లేదని స్పష్టం చేశారు. మంత్రులు హరీశ్ తదితరులు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, ఆ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామని తెలిపారు.
ఇక ఖమ్మం సభతో టీడీపీ జైత్రయాత్ర షురూ అయిందని, రాబోయే ఎన్నికల్లో జనం ఎవరి వైపు నిలుస్తారో స్పష్టమైందని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని అన్నారు. హరీశ్ రావు ఎక్కడ సభ పెట్టమంటే అక్కడ సభ పెడతామని సవాల్ విసిరారు. ఇప్పుడు బీఆర్ఎస్ పరాయి పార్టీ అయిపోయిందని, టీడీపీయే లోకల్ అని పేర్కొన్నారు.