Sensex: కరోనా భయాలు.. నేడు కూడా స్టాక్ మార్కెట్లో భారీ అమ్మకాలు
- ఒకటిన్నర శాతం నష్టాలతో సూచీల ట్రేడింగ్
- ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
- అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల ప్రభావం
చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో భారత ఈక్విటీ మార్కెట్ నేడు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిఫ్టీ, సెన్సెక్స్ ఒకటిన్నర శాతం వరకు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 50 సూచీ 248 పాయింట్లు క్షీణించి 17879 వద్ద, సెన్సెక్స్ 792 పాయింట్లు పడిపోయి 6033 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క ఫార్మా రంగం తప్పించి మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి.
మార్కెట్లో నష్టాలకు కారణాలను గమనిస్తే.. అమెరికాలో వినియోగదారుల సెంటిమెంట్, నిరుద్యోగ క్లెయిమ్ లు, క్యూ3 జీడీపీ గణాంకాలన్నీ సానుకూలంగా ఉండడంతో ఫెడ్ మరిన్ని వడ్డీ రేట్ల పెంపు చేపడుతుందన్న భయాలు పెరిగాయి. దీనికి కరోనా భయాలు కూడా తోడయ్యాయి. చైనాలో ఎన్నడూ లేనన్ని కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. జపాన్ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయి 3.7 శాతానికి నవంబర్ లో పెరిగిపోవడం కూడా ఆసియా వ్యాప్తంగా సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మార్కెట్లన్నీ నష్టాలను చూస్తున్నాయి. అయినా కానీ, భారత ఈక్విటీ మార్కెట్ బలంగా నిలదొక్కుకుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఇప్పుడు మన మార్కెట్ లో దిద్దుబాటు మొదలైనట్టు నిపుణులు చెబుతున్నారు.