JC Prabhakar Reddy: తాడిపత్రి డీఎస్పీ వైసీపీ తరపున భీమవరం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు: జేసీ ప్రభాకర్ రెడ్డి
- ఎమ్మెల్యే, డీఎస్పీ ఇద్దరూ అక్రమ ఇసుక వ్యాపారంలో భాగస్తులన్న జేసీ
- ఎమ్మెల్యే ఏది చెపితే డీఎస్పీ అది చేస్తున్నారని విమర్శ
- తనపై 59 కేసులు పెట్టారని ఆరోపణ
తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఏజెంట్ గా చైతన్య వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ ఇద్దరూ అక్రమ ఇసుక వ్యాపారంలో భాగస్వాములని అన్నారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏది చెపితే అది చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఒక ఆడపిల్లపై పగబట్టి 307 కేసును నమోదు చేశారని అన్నారు. తన మీద 59 కేసులు పెట్టారని తెలిపారు. తమకు చెందిన 861 మందిపై 307 సహా పలు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. వందల మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై తాను ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదని... చివరకు దీనిపై ఒక డీఐజీ వాస్తవాలను చెప్పారని అన్నారు. డీఎస్పీ చైతన్య వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.