Digvijay Singh: చేతులెత్తి వేడుకుంటున్నా... బహిరంగంగా మాట్లాడొద్దు: దిగ్విజయ్ సింగ్

Digvijay Singh requests Congress leaders not to speak about internal matters in public

  • పార్టీలోని విభేదాలపై బహిరంగంగా మాట్లాడొద్దని కాంగ్రెస్ నేతలకు హితవు
  • అందరూ కలసికట్టుగా ఉంటేనే ప్రత్యర్థులను ఓడించగలమని వ్యాఖ్య
  • అవినీతిలో బీఆర్ఎస్ రికార్డులు బద్దలు కొట్టిందని విమర్శ

తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. పరిస్థితులను చక్కదిద్దడానికి కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వచ్చారు. పార్టీ నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఈరోజు గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై బహిరంగంగా ఎవరూ మాట్లాడొద్దని ఆయన చెప్పారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని అన్నారు. అందరూ కలసికట్టుగా ఉంటేనే ప్రత్యర్థులను ఓడించగలమని చెప్పారు. ఏ సమస్యపై అయినా పార్టీలోనే అంతర్గతంగా చర్చించాలని చేతులెత్తి వేడుకుంటున్నానని అన్నారు.  

ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉందని డిగ్గీరాజా తెలిపారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీలో సీనియర్, జూనియర్ అనే ప్రస్తావన తీసుకురావద్దని చెప్పారు. పీసీసీ చీఫ్, ఇన్చార్జీల మార్పు తన పరిధిలోని అంశం కాదని అన్నారు. మోదీ పాలనలో మధ్య, దిగువ తరగతి ప్రజలు చితికిపోతున్నారని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. 

రాహుల్ భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని... అందుకే యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ సర్కార్ యత్నిస్తోందని మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి, రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అప్పట్లో టీఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారని, వారిద్దరే తెలంగాణను తీసుకొచ్చారా? అని దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. తెలంగాణను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని... అలాంటి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రచారం చేశారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అవినీతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డులను బద్దలు కొట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ పై పోరాటానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News