Sam Curran: రూ.18.50 కోట్లతో రికార్డ్... ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పొందిన శామ్ కరన్
- ఐపీఎల్ వేలంలో రికార్డు
- శామ్ కరన్ ను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
- ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కు రూ.17.50 కోట్లు
- బెన్ స్టోక్స్ కు రూ.16.25 కోట్ల ధర
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా ఇంగ్లండ్ యువ ఆల్ రౌండర్ శామ్ కరన్ నిలిచాడు. నేటి ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఈ ఎడమచేతివాటం ఆటగాడికి ఏకంగా రూ.18.50 కోట్ల భారీ ధర లభించింది.
శామ్ కరన్ ను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా వేలం పాటను పెంచేశాయి. అతడి కనీస ధర రూ.2 కోట్లు కాగా.... చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి రూ.18.50 కోట్లతో శామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ చేజిక్కించుకుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక, అప్పటినుంచి మరే ఆటగాడికీ ఇంత ధర లభించలేదు.
ఇక, ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం ఇవాళ్టి వేలంలో సంచలనం సృష్టించాడు. గ్రీన్ కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటాపోటీగా వేలం పాటలో పాల్గొన్నాయి. కామెరాన్ గ్రీన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అతడిని ముంబయి ఇండియన్స్ రూ.17.50 కోట్లతో కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర కావడం విశేషం.
ఇంగ్లండ్ సీనియర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సైతం కోట్లు కొల్లగొట్టాడు. ఈసారి వేలంలో నిలిచిన స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.16.25 కోట్లకు దక్కించుకుంది.
ఓ దశలో లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు స్టోక్స్ కోసం పోటీపడ్డాయి. రూ.15 కోట్ల బిడ్ వద్ద సన్ రైజర్స్ రేసు నుంచి వైదొలగింది. తాము తప్పుకుంటున్నట్టు సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి చెందిన కావ్యా మారన్ వేలం నిర్వాహకుడు ఎడ్మీడియస్ కు స్పష్టం చేశారు. ఇక స్టోక్స్ లక్నో జట్టుకే అని అందరూ భావించేలోగా, చివరి నిమిషంలో సీఎస్కే ఫ్రాంచైజీ రంగంలోకి దిగింది. భారీతో ధరతో స్టోక్స్ ను దక్కించుకుంది.