Nikhil: మూవీ రివ్యూ: '18 పేజెస్'
- ఈ రోజునే థియేటర్లకు వచ్చిన '18 పేజెస్'
- నిఖిల్ జోడీగా మరోసారి మెప్పించిన అనుపమ
- కథాకథనాల్లో కనిపించిన కొత్తదనం
- అనుభూతి ప్రధానంగా నడిచే సినిమా
- రొమాన్స్ ను .. డ్యూయెట్లను ఆశించకూడని కథ ఇది
మొదటి నుంచి కూడా నిఖిల్ విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ సారి కూడా ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన కథను ఎంచుకున్నాడు. ఆ సినిమా పేరే '18 పేజెస్'. ఈ సినిమాకి సుకుమార్ కథను అందించడమే కాకుండా, గీతా ఆర్ట్స్ 2 వారి నిర్మాణంలో భాగంగా ఉన్నాడు. పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇంతకుముందు నిఖిల్ ప్రేమకథా చిత్రాలు చేశాడు .. అలాగే ప్రేమకథా ఇతివృత్తంతో రూపొందిన కథతోనే అనుపమ వెండితెరకి పరిచయమైంది. సుకుమార్ కూడా ప్రేమకథలను టచ్ చేసి తన మార్క్ చూపించాడు. ఇక గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ప్రేమకథల్లో విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఇలాంటి ఒక కాంబినేషన్లో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం ఎలా ఉందనేది ఒకసాగారి చూద్దాం.
సిద్ధూ (నిఖిల్) ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తుంటాడు. హ్యూమన్ రిలేషన్స్ పట్ల ఆయనకి గౌరవం ఎక్కువ. తన పేరెంట్స్ తన తాతయ్య ఎమోషన్స్ ను పట్టించుకోకపోవడం వల్లనే ఆయన ఇల్లొదిలి వెళ్లిపోయాడని భావించిన సిద్ధూ, తాను కూడా ఇంటికి దూరంగా ఉంటూ ఉంటాడు. తన సహోద్యోగి భాగి (సరయు)తోనే తన ఫీలింగ్స్ ను పంచుకుంటూ ఉంటాడు. ప్రేమలో తనని ఒకరు మోసం చేశారనే కారణంగా అమ్మాయిలకు దూరంగా ఉంటూ ఉంటాడు.
అలాంటి పరిస్థితుల్లోనే సిద్ధూకి రోడ్డు పక్కనే ఉన్న చెత్తలో ఒక డైరీ దొరుకుతుంది. రెండేళ్ల క్రితం నందిని (అనుపమ పరమేశ్వరన్) అనే యువతి రాసిన డైరీ అది. ఆ డైరీని ఇంటికి తీసుకొచ్చిన సిద్ధూ, అందులో 18 పేజీలు మాత్రమే రాసి ఉండటం చూస్తాడు. ఆ డైరీని చదవడం మొదలుపెడతాడు. నందిని ప్రకృతి ప్రేమికురాలు .. మానవతా విలువల పట్ల గౌరవం ఉన్న అమ్మాయి .. అనుబంధాలను దూరం చేసే ఫోన్లకు దూరంగా ఉంటూ, అనుభూతులకు మాత్రమే ప్రాధాన్యతని ఇవ్వడం ఆమె నైజం అనే విషయం ఆ డైరీ ద్వారా సిద్దూకి తెలుస్తుంది.
విజయనగరం దగ్గరున్న ఒక పల్లెటూరిలో పుట్టి పెరిగిన నందిని, తన తాతయ్య ప్రాణం పోవడానికి ముందు తన చేతికి ఇచ్చిన కవర్ ను, ఆయన చెప్పిన వెంకట్రావుకి ఇవ్వడానికి హైదరాబాద్ వస్తుంది. ఆ వెంకట్రావు ఆచూకి తెలుసుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. మొత్తానికి అతన్ని ఒక పార్కులో కలుసుకుంటుంది. అక్కడి నుంచి ఆ డైరీలో ఖాళీ పేజీలు ఉంటాయి. ఎందుకని నందిని ఏమీ రాయకుండా ఆ పేజీలను వదిలేసింది అదే ఆలోచన సిద్ధూను తొలిచేస్తుంది.
దాంతో అతను నందిని ఊరువెళ్లి .. అక్కడి వారిని కనుక్కుని ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ నందిని అమ్మమ్మ మాత్రమే ఉంటుంది. ఆమె ద్వారా ఒక నిజం తెలుసుకున్న సిద్దూ షాక్ అవుతాడు. అతను తెలుసుకున్న ఆ చేదు నిజం ఏమిటి? నందిని ఏమైంది? ఆమెతోనే తన జీవితాన్ని ఊహించుకుంటూ వచ్చిన సిద్ధూ ఏం చేస్తాడు? అనేదే కథ.
సాధారణంగా హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం .. అలగడం .. ఆటపట్టించడం .. ఒకరినొకరు దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించడమనేది ప్రేమకథలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా అవతల వ్యక్తి భావాలు .. ఆలోచనలు .. వ్యక్తిత్వం నచ్చి ప్రేమించడమనే అనుభూతి ప్రధానమైన ప్రేమకథలు కొన్ని ఉంటాయి. హీరో - హీరోయిన్ ప్రత్యక్షంగా కలవకపోయినా .. పరవశించి పాడుకోకపోయినా వాళ్లిద్దరి మధ్య ప్రేమ అనే ఒక అనుభూతి ఆడియన్స్ ను ముందుకు తీసుకుని వెళుతుంది .. అలాంటి ప్రేమకథనే '18 పేజెస్'.
ఇది సుకుమార్ అందించిన కథ .. ఆయన స్థాయికి తగినట్టుగానే ఈ కథ నిండుగా కనిపిస్తుంది. ఆరంభంలో కథ ఒక పది నిమిషాల పాటు ఆలోచనలో పడేసినా, ఆ తరువాత అనుపమ డైరీ నిఖిల్ చేతికి దొరికిన దగ్గర నుంచి కథ ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళుతుంది. డైరెక్టర్ అనుపమ కథను ఫ్లాష్ బ్యాక్ లో చూపించి .. హీరో కథను ప్రెజెంట్ లో చూపిస్తే రొటీన్ గానే అనిపించేది. కానీ నిఖిల్ చేత డైరీ ఓపెన్ చేయించి అటు అనుపమ కథను .. ఇటు ఇతని కథను కలిపి నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది.
నిఖిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అనుపమ ఎక్స్ ప్రెషన్స్ హైలైట్. ఈ సినిమాలో తను మరింత అందంగా కనిపించింది. ఇక సరయూకి ఈ సినిమాలో మంచి పాత్రనే దక్కింది. ఆమె పాత్ర కాస్త గట్టిగానే సందడి చేసింది. పోసాని .. అజయ్ .. శత్రు వంటివారు ఉన్నప్పటికీ, నిఖిల్ .. అనుపమ .. సరయు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది.
ప్రధానమైన పాత్రలను సుకుమార్ తీర్చిదిద్దిన తీరు .. ఆ పాత్రలను సహజత్వానికి దగ్గరగా పల్నాటి సూర్యప్రతాప్ తెరపై ఆవిష్కరించిన విధానం .. కిట్టు విస్సా ప్రగడ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. 'ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు .. ఎందుకు ప్రేమించావంటే ఆన్సర్ ఉండకూడదు' .. 'ఒక్కసారి ఫోన్ ఆఫ్ చేసి చూడు .. నీతో మాట్లాడాలనుకునేవారు నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
గోపీసుందర్ స్వరపరిచిన బాణీల్లో 'ఏడు రంగుల్లోనే' మనసును పట్టుకుంటుంది. ఇక ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. వసంత్ కెమెరా పనితనం కూడా గొప్పగా ఉంది. అనుపమను మరింత అందంగా చూపించాడు. కథకి అవసరమైన ఫీల్ దెబ్బతినకుండా .. నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది .. నిజానికి ఈ స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లికేటెడ్ .. అయినా ఆడియన్స్ ఎక్కడా కన్ఫ్యూజ్ కారు.
ప్రేమించడమంటే ఒకరి ఆశలను .. ఆశయాలను మరొకరు నెరవేర్చడమే అనే సందేశాన్ని ఇవ్వడంలో రచయితగా సుకుమార్ .. అనుభూతులను ప్రేక్షకులకు అప్పగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. హీరో .. హీరోయిన్ మధ్య రొమాన్స్ .. రొమాంటిక్స్ సాంగ్స్ లేని ప్రేమకథా చిత్రం ఇది. సున్నితమైన మనసులను సుకుమారంగా తడిమే ఫీల్ గుడ్ మూవీ ఇది. అందువలన మాస్ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో చెప్పలేం గానీ, అనుభూతి ప్రధానమైన కథలను ఇష్టపడేవారికి మాత్రం కనెక్ట్ అవుతుంది.