China: చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్

Worlds largest Corona outbreak in China

  • కరోనాతో విలవిల్లాడుతున్న డ్రాగన్ కంట్రీ
  • డిసెంబర్ తొలి 20 రోజుల్లో 24.8 కోట్ల మందికి సోకిన వైరస్
  • మరణాలపై అందని సమాచారం

కరోనా మహమ్మారి దెబ్బకు చైనా విలవిల్లాడుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నమోదవుతున్న కేసులతో డ్రాగన్ కంట్రీ దిక్కుతోచని స్థితిలోకి జారుకుంటోంది. డిసెంబర్ తొలి 20 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి వైరస్ సోకింది. ఇది చైనా మొత్తం జనాభాలో 18 శాతానికి సమానం. 

చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నిన్న అంతర్గతంగా సమావేశమయింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ లో దిగ్భ్రాంతికి గురి చేసే ఈ విషయం ఉంది. అంతేకాదు, ఈ వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. చైనాలో ఇంతకు ముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసుల సంఖ్య 40 లక్షలు. ఈ ఏడాది జనవరి 19న ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. 

ఇప్పుడు ఏకంగా ఒకే రోజున దాదాపు 4 కోట్ల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ఒకే రోజున ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చెప్పొచ్చు. అయితే ఈ మీటింగ్ మినిట్స్ లో కరోనా మరణాలు ఎన్ని నమోదయ్యాయనే విషయాన్ని మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News