Shaik Rasheed: ఐపీఎల్ వేలంలో ధోనీ జట్టుకు ఎంపికైన గుంటూరు కుర్రాడు.. అతను మామూలోడు కాదు!
- రూ. 20 లక్షలకు షేక్ రషీద్ ను తీసుకున్న సీఎస్కే
- గుంటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టిన రషీద్
- గతేడాది అండర్19 ప్రపంచ కప్ లో భారత్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న యువ ఆటగాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో పలువురు స్టార్ క్రికెటర్లు కోట్ల రూపాయలు పలికి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. సత్తా ఉన్న విదేశీ, భారత క్రికెటర్లపై కోట్లు కురిపించిన ఫ్రాంచైజీలు పలువురు వర్ధమాన ఆటగాళ్లను కూడా కొనుగోలు చేశాయి. పెద్దగా పరిచయం లేని క్రికెటర్లను తమ జట్టులోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన షేక్ రషీద్ కు అవకాశం ఇచ్చింది. ప్రారంభ ధర రూ. 20 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. దాంతో, ఎవరీ షేక్ రషీద్ అనే చర్చ మొదలైంది.
క్రికెట్ ను ఫాలో అయ్యే వారికి రషీద్ సుపరిచితమే. తను మంచి ప్రతిభావంతుడు. కుడిచేతి వాటం టాపార్డర్ బ్యాటర్. లెగ్ స్పిన్ కూడా వేయగలడు. గతేడాది జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 18 ఏళ్ల రషీద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఈ క్రికెటర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టాడు. చిన్నతనం నుంచి క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. లోన్ రికవరీ ఏజెంట్ గా పని చేసిన తండ్రి బలీషా వలీ ప్రోత్సాహంతో ఆటలో ఒక్కో అడుగు ముందుకేస్తూ వచ్చాడు.
వివిధ వయో విభాగాల్లో ఆంధ్ర జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ భారత అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. అండర్ 19 ప్రపంచ కప్ లో మొత్తం 201 పరుగులు సాధించడమే కాకుండా ఫైనల్లో అర్ధ సెంచరీతో భారత్ కు కప్పు అందించడంతో అతని పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. గత ఐపీఎల్ వేలంలోనే అతను బరిలోకి దిగుతాడని ఆశించారు. కానీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ పై దృష్టి పెట్టేందుకు ఐపీఎల్ లో తన పేరు నమోదు చేసుకోలేదు. ఈ సారి వేలంలోకి వచ్చిన అతడిని చెన్నై సొంతం చేసుకుంది. దాంతో, ధోనీ, బెన్ స్టోక్స్, జడేజా వంటి మేటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం అతనికి లభించింది.