Ben Stokes: బెన్ స్టోక్స్ కొనుగోలుతో ధోనీ హ్యాపీ!
- వెల్లడించిన సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్
- వచ్చే సీజన్ లో మంచి పనితీరు చూపిస్తామన్న ఆశాభావం
- తదుపరి కెప్టెన్ గా స్టోక్స్ కు బాధ్యతలు అప్పగించొచ్చన్న విశ్లేషణలు
ఐపీఎల్ తాజా మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రూ.16.25 కోట్లు వెచ్చించి ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేసింది. దీనిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందన కోరగా.. స్టోక్స్ ను సొంతం చేసుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్టు, ఎందుకంటే వేలం చివర్లో అతడు వచ్చినట్లు తెలిపారు. ‘‘మాకు ఆల్ రౌండర్ కావాలి. స్టోక్స్ ను కొనుగోలు చేయడం పట్ల ఎంఎస్ ధోనీ ఎంతో సంతోషంగా ఉన్నాడు. కెప్టెన్సీ ఆప్షన్ ఉంది. కానీ, దీనిపై ఎంఎస్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాడు’’ అని కాశీ విశ్వనాథ్ చెప్పారు.
ఇదే వేలంలో కైల్ జామిసన్ ను సైతం సీఎస్కే సొంతం చేసుకుంది. దీనిపై మాట్లాడుతూ.. జామిసన్ గాయానికి గురయ్యాడు. కనుక ఇతర ఫ్రాంచైజీలు అతడ్ని చూడలేదు. అతడు గాయం నుంచి కోలుకున్నట్లు మాకు సమాచారం ఉంది. సీఎస్కే ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఈ సీజన్ లో మంచి పనితీరు చూపిస్తాం’’అని విశ్వనాథ్ అన్నారు.
విశ్లేషకులు అయితే సీఎస్కే తదుపరి కెప్టెన్ గా బెన్ స్టోక్స్ ను పరిగణిస్తున్నారు. కాశీ విశ్వనాథ్ సైతం కెప్టెన్సీ ఆప్షన్ ఉందంటూ పరోక్ష సంకేతం ఇచ్చినట్టయింది. గత సీజన్ కు ముందు రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇవ్వగా, అతడి వైఫల్యంతో ధోనీయే తిరిగి పగ్గాలు చేపట్టాల్సి ఉంది. కానీ, 40 ప్లస్ లో ఉన్న ధోనీ రిటైర్మెంట్ తీసుకునే యోచనలో ఉన్నాడు. కనుక స్టోక్స్ కు వారసత్వం అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘‘స్టోక్స్ కెప్టెన్ అవుతాడు. ఐపీఎల్ సీజన్ల మధ్య ధోనీ రెగ్యులర్ గా క్రికెట్ ఆడడం లేదు. కనుక కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేందుకు అతడికి ఇదొక మంచి అవకాశం’’ అని న్యూజిలాండ్ క్రికెట్ కామెంటేటర్ స్టైరిస్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.