Team India: బంగ్లా 231 ఆలౌట్.. భారత్ విజయ లక్ష్యం 145
- 71 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన లిటన్ దాస్
- చివర్లో రాణించిన నురుల్, తస్కిన్ అహ్మద్
- అక్షర్ కు మూడు, సిరాజ్ కు రెండు వికెట్లు
రెండో టెస్టులో భారత్ కు బంగ్లాదేశ్ 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్ నైట్ స్కోరు 7/0తో మూడో రోజైన నేడు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 70.2 ఓవర్లలో 231 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లోటు స్కోరు కారణంగా ప్రత్యర్థి ముందు చిన్న లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. బంగ్లా జట్టులో లిటన్ దాస్ (71) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ జాకిర్ హసన్ (51) కూడా అర్ధ సెంచరీతో రాణించగా.. చివర్లో నురుల్ హసన్ (31), తస్కిన్ అహ్మద్ (31) విలువైన పరుగులు అందించారు.
105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లా వీరి కారణంగా 200 దాటింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, అశ్విన్, ఉనాద్కట్ తలో వికెట్ రాబట్టారు. తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య బంగ్లా 227 పరుగులు చేయగా.. భారత్ 314 స్కోరు వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా, మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.