BJP: పేదలకు కేంద్రం శుభవార్త.. మరో ఏడాది పాటు ఉచిత రేషన్
- కరోనా కారణంగా 2020 నుంచి ఉచిత రేషన్ ఇస్తున్న కేంద్రం
- రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం పంపిణీ
- 2023 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయం
- 81 కోట్ల మందికి లబ్ధి.. కేంద్రంపై రూ. 2 లక్షల కోట్ల భారం
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. మరో ఏడాది పాటు ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించింది. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) ఉన్న వారికి బియ్యం ఉచితంగా ఇస్తోంది. ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం అందిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గోధుమలు కూడా ఇస్తోంది. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ 2020 నుంచి ఉచిత రేషన్ ను పొడిగిస్తూ వస్తోంది.
ఈ క్రమంలో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ పేదలకు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ఆన్ యోజనను జాతీయ ఆహార భద్రతా చట్టంలో డిసెంబర్ 2023 వరకు విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్రం తెలిపింది. పథకం పొడిగింపు వల్ల ప్రభుత్వంపై రెండు లక్షల కోట్ల రూపాయల భారం పడనుంది.