Team India: ఢాకా టెస్ట్.. భారత బ్యాటర్లను బెంబేలెత్తించిన మెహిదీ హసన్
- భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లలో మూడు మెహిదీ హసన్‌కే
- తీవ్రంగా నిరాశ పరిచిన గిల్, పుజారా, కోహ్లీ, రాహుల్
- భారత్ విజయానికి 100 పరుగులు అవసరం
ఢాకా టెస్టులో భారత జట్టు తడబడుతోంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌ను బంగ్లాదేశ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ బెంబేలెత్తించాడు. మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతడి దెబ్బకు భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. శుభమన్ గిల్ (7), చతేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (1) అతడికే బలయ్యారు. స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్(2)ను షకీబల్ పెవిలియన్ పంపాడు. దీంతో 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఉనద్కత్ (3), అక్షర్ పటేల్ (26) క్రీజులో ఉన్నారు.
ఈ టెస్టులో భారత్ విజయం సాధించాలంటే ఇంకా 100 పరుగులు అవసరం కాగా, బంగ్లాదేశ్‌కు ఆరు వికెట్లు చాలు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలే ఉంది. రేపు (ఆదివారం) టీమిండియా ఆటగాళ్లు బ్యాట్ ఝళిపించకుంటే కష్టమే. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ వంటివారు ఉన్నారు కాబట్టి భారత విజయం నల్లేరు మీద నడకే కావొచ్చు. ఇక, బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌట్ అయింది. లిటన్ దాస్ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జకీర్ హసన్ అర్ధ సెంచరీ (51)తో రాణించాడు.