Gali Janardhan Reddy: బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి గుడ్‌బై.. కర్ణాటకలో పార్టీ ప్రకటన
- అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
- కొంతకాలంగా బీజేపీపై అసంతృప్తిగా ఉన్న గాలి
- కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరిట కొత్త పార్టీని ప్రకటించిన నేత
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కర్ణాటకలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. ఆ రాష్ట్రంలో కీలక నేత, మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి అయిన గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజీనామా చేశారు. సొంతంగా కొత్త పార్టీని ప్రకటించారు. కొంతకాలంగా బీజేపీతో అసంతృప్తితో ఉన్న జనార్దన్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాసం ‘పారిజాత’లో మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆయన తన కొత్త పార్టీ పేరు ‘కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష’ అని ప్రకటించారు.
ఇకపై సొంత పార్టీతో రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని వెల్లడించారు. బీజేపీతో తన బంధం ముగిసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తానని తెలిపారు. కర్ణాటక ప్రజల హృదయాలను తమ పార్టీ గెలుచుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త పార్టీతో రాబోయే, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పోటీ చేసే నియోజకవర్గాలతో పాటు పార్టీ మేనిఫెస్టో ను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. తాను గంగావతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.