TSRTC: బస్సులో పారేసుకున్న పర్సు యువతి ప్రాణాలు కాపాడింది!

Purse that saves Girls Live in Telangana

  • పఠాన్‌చెరువులో బస్సెక్కి జేబీఎస్‌లో దిగిన యువతి
  • బస్సులో కనిపించిన పర్సు తెరిచి చూసిన కండక్టర్
  • ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అందులో లేఖ
  • అప్రమత్తమై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు సమాచారం
  • రంగంలోకి పోలీసులు.. యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు

ఓ యువతి బస్సులో ప్రయాణిస్తూ పారేసుకున్న పర్సు ఆమె ప్రాణాలను కాపాడింది. సికింద్రాబాద్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  పఠాన్‌చెరువులో బస్సెక్కిన ఓ యువతి సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌లో దిగింది. ప్రయాణికులందరూ బస్సు దిగాక కండక్టరుకు బస్సులో ఓ పర్సు కనిపించింది. అదెవరిదో తెలుసుకుందామని పర్సు తెరిచిన ఆయనకు అందులో కొన్ని డబ్బులతో పాటు ఓ లేఖ కూడా కనిపించింది. తెరిచి చూసిన ఆయన షాకయ్యాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అందులో రాసి ఉండడంతో వెంటనే అప్రమత్తమయ్యాడు. 

వెంటనే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు సమాచారం అందించాడు. పర్సులోని ఆధార్ కార్డు, సూసైడ్ లెటర్‌ను ఎండీకీ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అప్రమత్తమైన ఆయన యువతిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలంటూ సిబ్బందిని ఆదేశించారు. రంగంలోకి దిగిన ఆర్టీసీ ఎస్సై దయానంద్.. మారేడుపల్లి పోలీసుల సాయంతో యువతి కోసం గాలించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి. యువతిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుమార్తెను రక్షించి తమకు అప్పగించిన ఆర్టీసీ అధికారులు, పోలీసులకు యువతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుందన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

  • Loading...

More Telugu News