Haryana: బాబ్బాబు! బోర్డు ఎగ్జామ్ ఉన్నాయి.. పిల్లల్ని ఉదయాన్నే లేపండయ్యా: ఆలయాలు, మసీదులను కోరిన హర్యానా ప్రభుత్వం

Haryana wants wake up alarm for students by temples and mosques
  • లౌడ్ స్పీకర్ల ద్వారా విద్యార్థులను మేల్కొలపాలన్న ప్రభుత్వం
  • తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేచేలా చూడాలంటూ కాలేజీలు, ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ఆదేశాలు
  • ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలంటూ పంచాయతీలకూ ఆదేశం
  • తల్లిదండ్రులు సహకరించకుంటే స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ దృష్టికి తేవాలని సూచన 
ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని నిర్ణయించుకున్న హర్యానా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో 10, 12వ తరగతి విద్యార్థులు త్వరగా లేచి పరీక్షలకు సన్నద్ధమయ్యేలా చూడాలంటూ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలను కోరింది. మైకుల ద్వారా వారిని తెల్లవారుజామునే నిద్రలేపాలని కోరింది. అంతేకాదు, పిల్లలను 4.30 గంటలకు నిద్రలేపి పరీక్షలకు సన్నద్ధం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను విద్యాశాఖ కోరింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి జాయింట్ ప్లాన్ రూపొందించుకోవాలని, సెల్ఫ్ స్టడీ కోసం ప్రత్యేక గంటలు కేటాయించేలా చూడాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తెల్లవారుజామునకు మించినది లేదని, ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుందని, వాహనాల శబ్దాలు కూడా ఉండవని పేర్కొంది. కాబట్టి విద్యార్థులను తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేపేలా ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆదేశించింది. కనీసం 5.15 గంటల వరకు చదువుకునేలా చూడాలని కోరింది. పిల్లలు లేచారా? లేదా? అన్న విషయాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించింది. తల్లిదండ్రులు సహకరించకుంటే ఆ విషయాన్ని స్కూలు మేనేజ్‌మెంట్ కమిటీ దృష్టికి తీసుకు రావాలని సూచించింది. అంతేకాదు, తెల్లవారుజామున వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలని పంచాయతీలను కూడా ఆదేశించింది. 

లౌడ్ స్పీకర్ల ద్వారా ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు తెల్లవారుజామునే ఎనౌన్స్‌మెంట్లు చేయాలని, దీనివల్ల విద్యార్థులు లేచి చదువుకుంటారని, ఫలితంగా ప్రతి విద్యార్థికి అదనంగా రెండుమూడు గంటల సమయం దక్కుతుందని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అన్షాజ్ సింగ్ ప్రభుత్వ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. పరీక్షలకు ఇంకా 70 రోజుల సమయమే ఉందని, కాబట్టి మంచి ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.
Haryana
Board Exams
Ayodhya Temple Trust
Mosque
Gurudwara

More Telugu News