Tunisha Sharma: టీవీ నటి తునీషా ఆత్మహత్య కేసులో కొత్త కోణం.. పోలీసులకు కీలక విషయం చెప్పిన సహనటుడు షీజన్
- ఆదివారం ఆత్మహత్య చేసుకున్న హిందీ టీవీ నటి తునీషా శర్మ
- తల్లి ఫిర్యాదుతో షీజన్ ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
- తునీషా ఇది వరకు కూడా ఆత్మహత్యాయత్నం చేస్తే, తానే కాపాడానని షీజన్ వాంగ్మూలం
- ఆమెతో ప్రేమ సంబంధం ఉందని, తర్వాత విడిపోయామని ఒప్పుకున్న నటుడు
హిందీ టెలివిజన్ నటి తునీషా శర్మ ఆత్మహత్య బాలీవుడ్ లో కలకలం రేపింది. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె ఓ సీరియల్ షూటింగ్ సెట్ లో సహ నటుడి మేకప్ గదిలో ఆత్మహత్యకు పాల్పడటంతో పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 20 ఏళ్ల వయసులోనే తనువు చాలించిన తునీషా ఆత్మహత్యకు ఆమె సహనటుడైన షీజన్ ఖాన్ మహ్మద్ కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తునీషాను ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆమె తల్లి ఫిర్యాదుతో షీజన్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తునీషా ఆత్మహత్య వెనుక ‘లవ్ జిహాద్’ ఉందని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు గిరీష్ మహాజన్ ఆరోపించారు.
మరోపక్క, ఈ కేసులో కొత్త విషయం వెల్లడైంది. ప్రస్తుతం పోలీసు కస్టడిలో ఉన్న షీజన్.. తునీషా శర్మ ఇది వరకు కూడా ఆత్మహత్నాయత్నం చేసిందని, తానే ఆమెను రక్షించినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని తునీషా తల్లికి తెలిపానని, ఆమెను బాగా చూసుకోమని కోరినట్లు తెలిపాడు. ఈ క్రమంలో నటుడి వాంగ్మూలం వెనుక ఉన్న వాస్తవాలను పోలీసులు ధ్రువీకరించే పనిలో ఉన్నారు. ఇక, పోలీసుల విచారణలో నటుడు షీజన్ ఖాన్ తునీషా శర్మతో సంబంధం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. అయితే, భిన్న వర్గాలకు చెందినవారు కావడం, ఇద్దరి మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉండటం కూడా ఆమె విడిపోవడానికి ప్రేరేపించిందని షీజన్ పోలీసులకు చెప్పాడు.
మరోవైపు ఈకేసులో ఇప్పటివరకు తమ విచారణలో తునీషా ఆత్మహత్యకు బ్లాక్ మెయిల్ లేదా లవ్ జిహాద్ కోణం ఉందనే కారణం ఏమీ కనిపించలేదని ఏసీపీ చంద్రకాంత్ జాదవ్ తెలిపారు. ఇదిలా ఉండగా తునీషా శర్మ ఉరివేసుకుని చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో నిర్ధారించారు. ఇంగ్లండ్ నుంచి ఆమె అత్త రాకతో మంగళవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.