Raghu Rama Krishna Raju: 150 మందితో ట్వీట్ల దాడి చేసినా నేను భయపడను: రఘురామకృష్ణరాజు
- తనపై ట్వీట్లు పెట్టినవారిని అభినందిస్తున్నానన్న రఘురాజు
- తెరవెనుక నుంచి ట్వీట్లు పెట్టించవద్దని విజ్ఞప్తి
- కవులు, కవయిత్రులు అంటూ వైసీపీ నేతలపై వ్యంగ్యం
సీఎం జగన్, ఇతర వైసీపీ నేతలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తనపై వైసీపీ నేతలు ట్వీట్లతో దాడి చేస్తున్నారని విమర్శించారు. తనపై ట్వీట్లు పెట్టినవారిని అభినందిస్తున్నానని, త్వరలో 150 మంది ఎమ్మెల్యేలతో తనపై ట్వీట్లు పెట్టిస్తారేమోనని రఘురామ వ్యాఖ్యానించారు.
తెరవెనుక నుంచి ట్వీట్లు పెట్టించవద్దని జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఎమ్మెల్యే అతడి పేరు మీద ఎలాంటి ట్వీట్లు పెట్టడని, పక్కవాళ్ల పేరు మీదే పెట్టిస్తాడని వ్యంగ్యం ప్రదర్శించారు.
మీరు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను... మూకుమ్మడి ట్వీట్ల దాడికి భయపడను అంటూ స్పష్టం చేశారు. 150 మంది ట్వీట్లతో రావయ్యా జగన్మోహనా అంటూ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి, తానేటి వనిత తదితరులు తనపై చేసిన ట్వీట్లను రఘురామ ఈ సందర్భంగా ఉదహరించారు.
అయోధ్యరామిరెడ్డిని కవిగా పేర్కొన్న రఘురామ... మేకతోటి సుచరితను కవయిత్రిగా పేర్కొన్నారు. ఆమె చేసిన ట్వీట్ ను కూడా చదివి వినిపించారు. ఈ ట్వీట్లు చేసేవారికి ట్విట్టర్ లో పెద్దగా ఫాలోయింగ్ లేదని, అందుకే వారి ట్వీట్లను అందరికీ ప్రదర్శించడం ద్వారా తాను వారికి ప్రచారం కల్పిస్తున్నానని రఘురామ చమత్కరించారు. ఇక తానేటి వనిత ట్వీట్ ను చదివి వినిపిస్తూ, ఇది తాడేపల్లి ప్యాలెస్ లో వండిన ట్వీట్ అంటూ విమర్శించారు.